Nov 05,2023 11:18

సంతానం కమిటీ సిఫార్సులు గుర్తుకురావడం లేదా?
న్యూఢిల్లీ : 
 ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు 'నేను గాంధీజీ దేశం నుండి వచ్చాను' అని గొప్పగా చెబుతుంటారు. ఆయన ఆదర్శాలను మాత్రం విస్మరిస్తుంటారు. ఎన్నికల వ్యయంపై 1931 సెప్టెంబర్‌ 17న గాంధీజీ లండన్‌లో జరిగిన ఫెడరల్‌ వ్యవస్థ కమిటీ భేటీలో మాట్లాడుతూ... రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వ్యయం కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ వంటి పేద దేశంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి 60 వేల నుండి లక్ష రూపాయల వరకూ (ఆ రోజుల్లో) ఖర్చు చేయడం దారుణమని చెప్పారు. ఇప్పుడు గాంధీజీ

జీవించి ఉంటే అభ్యర్థుల ఖర్చు చూసి ఏమనేవారో?
మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రిని కూడా మోడీ ప్రశంసిస్తుంటారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీలపై మాత్రం సందర్భం వచ్చిన ప్రతిసారీ విరుచుకుపడుతుంటారు. అయితే లాల్‌ బహదూర్‌ శాస్త్రి కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు 1962లో ఏర్పాటు చేసిన సంతానం కమిటీ ఇచ్చిన నివేదికను మాత్రం మోడీ ఎప్పుడూ ప్రస్తావించరు. స్వాతంత్య్రానంతరం అవినీతిపై ఏర్పడిన తొలి కమిటీ అదే. సంతానం కమిటీ 'అన్ని రాజకీయ పార్టీలు తమ జమాఖర్చుల వివరాలను సరైన పద్ధతిలో నమోదు చేయాలి. ఎవరెవరు ఎంత మొత్తంలో అందజేశారో తెలియజేయాలి. అలాంటి ఖాతాలను ఆడిట్‌ చేయించి ప్రచురించాలి' అని సూచించింది. ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో సంతానం కమిటీ చేసిన సూచనకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

రాజకీయ పార్టీలు తాము పొందే సొమ్మును తప్పనిసరిగా వెల్లడించేలా ఓ చట్టాన్ని రూపొందించాలని సంతానం కమిటీ సిఫార్సు చేసింది. 'రాజకీయ పార్టీలు ఈ సూచనకు అభ్యంతరం తెలుపుతారని మేము అనుకోవడం లేదు. స్వచ్ఛంద ఒప్పందాల ద్వారా రాజకీయ పార్టీలు ఈ పని చేయడం సులభం కాదు. అందుకే ఓ చట్టం చేయాలి. జమాఖర్చుల ఖాతాల నిర్వహణ, ప్రచురణను తప్పనిసరి చేయాలి' అని కమిటీ తెలిపింది. అప్పుడు సంతానం కమిటీ చేసిన సిఫార్సులకు ఇప్పుడు మోడీ ప్రభుత్వం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. పార్టీలకు అందే విరాళాల గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరమే లేదని చెబుతోంది. తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని అంటోంది.

సంతానం కమిటీ మరో వ్యాఖ్య కూడా చేసింది. 'అత్యున్నత రాజకీయ స్థాయిలో అవినీతి జరుగుతోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పార్టీలకు అందుతున్న సొమ్ము వారి అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. పెద్ద మొత్తంలో నిధులు లేకుంటే రాజకీయ పార్టీని నడపడం, ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదు. అయితే ఈ నిధులు పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరుల నుండి బహిరంగంగానే రావాల్సి ఉంటుంది' అని తెలిపింది. ప్రజలకు సమాచారం కోసం రాజకీయ పార్టీలు తమకు ఎవరెవరి నుండి ఎంత మొత్తంలో నిధులు అందాయో ఖాతాల్లో పొందుపరిచి, వాటిని ప్రచురించాలని సంతానం కమిటీ నొక్కి చెప్పింది.

కార్పొరేట్‌ సంస్థల విరాళాలు వద్దు
రాజకీయ పార్టీలకు నిధులు ఇవ్వకుండా కార్పొరేట్‌ సంస్థలను నిషేధించాలని సంతానం కమిటీ కీలక సూచన చేసింది. 'భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, తమ విరాళాల ద్వారా రాజకీయాల్లో పాల్గనేందుకు కంపెనీలను అనుమతించరాదని మేము భావిస్తున్నాం. 1960వ సంవత్సరపు కంపెనీల చట్టాన్ని కూలంకషంగా పరిశీలించి, చర్చించాం. కంపెనీల విరాళాలన్నింటి పైన పూర్తి నిషేధం విధించాల్సిందే' అని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు ప్రజల నుండి విరాళాలు పొందడమే మంచిదని సూచించింది. అప్పుడే ఎన్నికల వ్యయానికి సంబంధించిన అవినీతిని రూపుమాపవచ్చునని అభిప్రాయపడింది. 'మూడు కుటుంబాలలో కనీసం ఒక కుటుంబం అయినా రాజకీయ పార్టీకి సంవత్సరానికి ఒక రూపాయి అందజేస్తే అది ఆ పార్టీ చట్టబద్ధమైన అవసరాలకు సరిపోతుంది' అని వ్యాఖ్యానించింది. ఎన్నికల బాండ్ల పథకం ద్వారా బిజెపి పెద్ద మొత్తంలో విరాళాలు పొందుతున్న తరుణంలో సంతానం కమిటీ సూచనలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. విరాళాల రూపంలో అందే నిధులు చివరికి అవినీతికి దారితీస్తాయని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గాంధీజీ వ్యాఖ్యలను, సంతానం కమిటీ సిఫార్సులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల బాండ్ల చట్టబద్ధతను, చెల్లుబాటును పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.