Aug 01,2023 10:16

ప్రజాశక్తి - యలమంచిలి, పెనుమంట్ర (పశ్చిమగోదావరి జిల్లా) : దేశం విముక్తి చెందాలంటే ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో అమరవీరుల 73వ స్మారక సభ, పెనుమంట్రలో కల్లుగీత కార్మికోద్యమ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌.దాట్ల వర్థంతి సభల్లో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ పేదల పొట్ట కొట్టి పెద్దలకు దోచిపెట్టేలా మోడీ దుర్మార్గ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మరోపక్క కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య కలహాలు సృష్టిస్తూ, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బిజెపికి వైసిపి, టిడిపి, జనసేన మద్దతు తెలపడం బానిసత్వానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరచి వారి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాల ఫలితంగానే చించినాడ గ్రామంలో 68 సంవత్సరాల పాటు ఎర్రజెండా ఆధ్వర్యంలో పరిపాలన సాగిందన్నారు. సభలో మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు మాట్లాడారు. సభకు బాలరాజు అధ్యక్షత వహించారు. తొలుత అమవీరుల స్తూపంపై జెండాను బలరాం ఆవిష్కరించారు.
 

                                                            దాట్ల వారసత్వం కొనసాగించడం అభినందనీయం

అమరజీవి, కల్లుగీత కార్మికోద్యమ నిర్మాత ఎస్‌ఆర్‌.దాట్ల వారసత్వాన్ని కొనసాగించడం అభినందనీయమని వి.శ్రీనివాసరావు అన్నారు. ఎస్‌ఆర్‌.దాట్ల 44వ వర్థంతి సందర్భంగా పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువులో చింతపల్లి శ్రీరాములు స్మారక బస్టాండ్‌ వద్ద హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ వారి సహకారంతో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. అనంతరం చింతపల్లి శ్రీరాములు స్మారక బస్టాండ్‌ నుండి పెనుమంట్ర ఎస్‌ఆర్‌.దాట్ల స్తూపం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్యం కోసమే కుటుంబం అప్పుల పాలవడం, ఆత్మహత్యలకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా యన్నారు. అందరికీ విద్య, వైద్యం ప్రాథమిక హక్కుగా ఉండాలన్నారు. చేతివృత్తిదారులకు సమగ్ర చట్టం తీసుకొస్తే తప్ప వృత్తుల రక్షణ సాధ్యం కాదని తెలిపారు.