
ఈ నెల 11, 12 తేదీల్లో ప్రధాని మోడీ విశాఖ పర్యటిస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటి సారి మోడీ విశాఖ వస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలి. నవంబర్ 12న మోడీ ప్రసంగించే బహిరంగ సభలో 'విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మం' అని ప్రకటించాలి.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు కొత్తవేమీ కాదు. 1991లో సరళీకరణ విధానాల ప్రారంభం నుంచి సాగుతున్న కుట్రకు కొనసాగింపే నేటి విశాఖ స్టీల్ పూర్తి అమ్మకపు ప్రక్రియ. 1990వ దశకంలో స్టీల్ ప్లాంట్‌కు గుండెకాయ లాంటి స్టీల్ మెల్టింగ్ షాప్‌ను ప్రైవేట్‌కు ఇవ్వాలని, తర్వాత కోక్‌ఓవెన్ బ్యాటరీలు ప్రైవేట్‌కు అప్పగించాలనే ప్రయత్నాలు సాగాయి. థర్మల్ ప్లాంట్ విస్తరణ జాయింట్ వెంచర్‌కు కట్టబెట్టాలనే కుట్ర జరిగింది. విశాఖ స్టీల్ కార్మికవర్గం అడుగడుగునా దాన్ని తిప్పికొట్టింది. 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో విశాఖ స్టీల్‌ను సిక్ పరిశ్రమగా ప్రకటించి వేలం వెయ్యాలని నిర్ణయించింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా విశాఖ స్టీల్‌ను సిక్ పరిశ్రమగా అమ్మాలనే విధానాన్ని గట్టిగా సమర్ధించారు. కాని యావత్తు కార్మికులు, కార్మిక సంఘాలు అడుగడుగునా పోరాడి కేంద్ర ప్రభుత్వాల ప్రయత్నాలను తిప్పి కొట్టారు. విశాఖ స్టీల్ పోరాటంలో ఆనాడు విశాఖ స్టీల్ కార్మికులు ఒక్కరే పోరాడారు. నేడు రాష్ట్రం అంతా ఒక్కటై పోరాడుతున్నది.
మోడీ ప్రధానిగా వచ్చినప్పటి నుంచి విశాఖ స్టీల్‌ను ప్రైవేట్ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2017 నుంచి దక్షిణ కొరియా పోస్కో కంపెనీతో లోగుట్టు ఒప్పందాలు సాగాయి. 2018లో పోస్కో దూతలు విశాఖలో అడుగు పెట్టారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 4 వేల ఎకరాల భూములు పోస్కోకు స్వాధీనం చేస్తే...5 మిలియన్ టన్నులు అదనంగా ఉత్పత్తి చేసే మరో స్టీల్‌ప్లాంట్‌ను రూ.25 వేల కోట్లతో నిర్మిస్తామని నమ్మబలికారు. 2019లో పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. కడపలో స్టీల్‌ప్లాంట్ పెట్టమన్న ముఖ్యమంత్రి కోర్కెను పోస్కో కంపెనీ ఖాతరు చేయలేదు. జగన్‌పై ఒత్తిడి తెచ్చి మోడీ జాయింట్ వెంచర్‌కు ఒప్పించారు. కాని కోవిడ్ వచ్చిన తర్వాత భూమి ఒక్కటే కాదు. మొత్తం స్టీల్‌ప్లాంట్‌ను తమకు స్వాధీనం చేయాలనే పోస్కో కంపెనీ డిమాండ్‌ను మోడీ అంగీకరించి 2021 జనవరి 27న విశాఖ స్టీల్ పూర్తి అమ్మకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. కోవిడ్ కాలంలో ఎవరూ నోరెత్తరని భావించిన బిజెపి కి రివర్స్ స్పందన వచ్చింది. అన్ని విషయాల్లో దూకుడుగా మాట్లాడే బిజెపి కి విశాఖ స్టీల్ అమ్మకం గొంతులో వెలక్కాయ పడ్డ చందంగా అయ్యింది.
విశాఖ స్టీల్‌ను బలహీన పరచి కారుచౌకగా అమ్మాలనేది కేంద్ర ప్రభుత్వ కుట్ర. స్వంత గనులు ఇవ్వకపోయినా విశాఖ స్టీల్ బలహీనపడలేదు. కేంద్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్‌లకు పూర్తిగా పెట్టుబడులు సమకూర్చారు. విశాఖ స్టీల్‌కు ఆరంభంలో ఇచ్చిన రూ.5 వేల కోట్లు తప్ప తర్వాత విస్తరణకు ఏ మాత్రం పెట్టుబడులు సమకూర్చలేదు. 2000 సంవత్సరం నాటికి రూ.4 వేల కోట్లు పైగా నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ 2008 నాటికి నష్టాలు వడ్డీలతో సహా చెల్లించి మరో రూ.6,500 కోట్లు రిజర్వు నిధులు మిగిల్చింది. 32 లక్షల టన్నుల నుంచి స్వంత లాభాలతో 63 లక్షల టన్నుల సామర్ధ్యానికి విస్తరించింది. విశాఖ స్టీల్ విస్తరణ కోసం అదనంగా తెచ్చిన రూ. 6 వేల కోట్లు రుణ భారం వడ్డీతో నేడు రూ.20 వేల కోట్లకు పెరిగింది. రూ.5 వేల కోట్ల పెట్టుబడులతో ప్రారంభించిన విశాఖ స్టీల్ నేడు రూ.3 లక్షల కోట్ల ఆస్తులు పెంచుకోగలిగింది.
కేంద్ర ప్రభుత్వం కావాలనే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఇప్పటికీ స్వంత గనులు సమకూర్చలేదు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌లకు స్వంత గనులున్నాయి. స్టీల్ ప్లాంట్ నిర్మాణమే చెయ్యని విదేశీ పోస్కోకు ఒడిషాలో స్వంత గనులున్నాయి. కార్పొరేట్లు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎంత ప్రేమెూ? విశాఖ స్టీల్‌కు ఎందుకు స్వంత గనులు కేటాయించరు? స్వంత గనులు లేనందు వల్ల విశాఖ స్టీల్ సాలీనా రూ. 2 వేల కోట్లు నష్టపోతున్నది. స్వంత గనులు సమకూర్చకపోవడం కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ పట్ల వివక్షత మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలోని ఇనుపగనులు ఇవ్వాలని సిఐటియు వేసిన రిట్ పిటిషన్‌కు హైకోర్టు స్పందించింది. బయ్యారం లోని గనులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆనాటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. నేటికీ అమలు కాలేదు. గంగవరం పోర్టును అదానీకి అమ్మడంతో 25 సంవత్సరాల టారిఫ్ ఒప్పందం ఉన్నా అదానీ రవాణా ఛార్జీలు పెంచారు.
కేంద్ర ప్రభుత్వం స్వంత గనులు కేటాయించకపోగా స్టీల్ ప్లాంట్ లాభాలను పక్కదారి పట్టించింది. 12 సంవత్సరాల క్రితం ఒడిషా లోని రాష్ట్ర ప్రభుత్వ గనులను విశాఖ స్టీల్ రూ. 370 కోట్లు పెట్టి కొన్నది. నేటికీ విశాఖ స్టీల్‌కు ఒక్క టన్ను ముడి ఖనిజం రాలేదు. పైగా ఒడిషా రాష్ట్ర యాజమాన్యం చేసిన పొరపాట్లకు విశాఖ స్టీల్‌పై సుప్రీంకోర్టు వెయ్యి కోట్లు జరిమానా విధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఉత్తరప్రదేశ్ లోని సోనియా గాంధీ నియోజకవర్గం రారుబరేలిలో రైల్ వీల్ ప్లాంట్ కోసం అవసరం లేకున్నా రూ. 1500 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఫలితం శూన్యం. విశాఖ స్టీల్ ప్లాంట్ నిధులు దుర్వినియోగం చేసినా 2020-21 సంవత్సరంలో విశాఖ స్టీల్ రూ. 942 కోట్లు లాభాలను ఆర్జించింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 28 వేల కోట్ల టర్నోవర్ సాధించింది. రూ.50 వేల కోట్లకు పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విశాఖ స్టీల్ ప్లాంట్ పన్నులు చెల్లించింది. బంగారు బాతు లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మాలనే నిర్ణయం దుర్మార్గం.
కోవిడ్ కాలాన్ని అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ఉత్పత్తిని బాగా దెబ్బతీస్తున్నది. విశాఖ స్టీల్ ప్లాంట్ నూరు శాతం సామర్థ్యంతో నడపాలి. కార్మికులు సమ్మె చేస్తున్నారంటే ఒక్క రోజైనా బ్లాస్ట్ ఫర్నేస్ ఆగకూడదని సిద్ధాంతం చెప్పేవారు. కాని సంవత్సర కాలం నుంచి అత్యాధునికమైన మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌ను మూసివేశారు. స్టీల్ మెల్టింగ్ షాప్, కోక్ ఓవెన్స్ ఉత్పత్తి బాగా తగ్గించారు. ఆరు మిల్లులలో 4 మిల్లులు మూతపడ్డాయి. స్టీల్ మార్కెట్‌లో టన్ను 90 వేలకు పైగా రేటు ఉన్న సమయంలో స్టీల్ ఉత్పత్తిని కావాలని 50 శాతం తగ్గించడం వల్ల భారీగా నష్టపోయాం. డైరక్టర్ ఆఫ్ ఫైనాన్స్, డైరక్టర్ ఆపరేషన్స్, డైరక్టర్ పర్సనల్ లాంటి కీలక పోస్టులు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉన్నాయి. కాని అవసరం లేని డైరక్టర్ ప్రాజెక్ట్స్‌ను ఇటీవలే నియమించారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ చైర్మన్‌కు ఏ స్టీల్‌ప్లాంట్ లోనూ పనిచేసిన అనుభవం లేదు. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేయడానికి తనకు అనుకూలమైన వారిని కేంద్ర ప్రభుత్వం నియమించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి...ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లోనూ, విశాఖ నగరంలోనూ ఉద్యమాలు నిరవధికంగా సాగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలతోనూ, అఖిల భారత ట్రేడ్ యూనియన్ నాయకులతోనూ అఖిలపక్ష భారీ బహిరంగ సభలు జరిగాయి. కిసాన్ మోర్చా ఢిల్లీ నాయకులతో విశాఖ బీచ్‌లో భారీ సంఘీభావ సభ జరిగింది. 10 వేల మంది...కుటుంబాలతో సహా...10 కిలోమీటర్ల మానవహారంలో పాల్గొని జయప్రదం చేశారు. గత 21 మాసాల్లో మూడు సార్లు సమ్మెలు, రెండు సార్లు బంద్‌లు జరిగాయి. 11వ తేదీన మోడీ విశాఖలో పర్యటించనున్న సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాని తదుపరి నిజాయితీగా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా పోరాడుతుందనే విశ్వాసం ప్రజల్లో, కార్మికుల్లో లేదు. 32 మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకోవడం రాష్ట్ర ప్రజల కర్తవ్యం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం వచ్చి 8 సంవత్సరాలైనా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. ప్రత్యేక హోదా మన హక్కు. ప్రత్యేక హోదా లేకపోవడంతో కొత్త పరిశ్రమలు రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు మణిహారమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకుండా చావో రేవో తేల్చుకోవడానికి ప్రజలు సిద్ధం కావాలి.
వ్యాసకర్త : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్.నరసింగరావు