పారిస్ : ఫ్రాన్స్ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్‌ను ప్రధాని నరేంద్ర మోడీకి ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ అందచేశారు. ఈ పురస్కారం అందుకును మొదటి భారత ప్రధాని మోడీనే. గురువారం ఎలిసీ ప్యాలెస్‌లో అవార్డు ప్రదానం జరిగింది. గతంలో ఈ అవార్డు అందుకును నెల్సన్ మండేలా, కింగ్ చార్లెస్, ఏంజెలా మెర్కెల్ వంటి ప్రముఖుల జాబితాలో మోడీ చేరారు. 1802లో నెపోలియన్ బోనాపార్టీ నెలకొల్పిన ఈ అవార్డు ఫ్రెంచి జాతీయులకే పరిమితమైనా, ఫ్రాన్స్‌కు సేవలందించిన లేదా ఫ్రాన్స్ విలువలు, ఆదర్శాలను పరిరక్షించిన వారికి కూడా లీజియన్ ఆఫ్ ఆనర్ అందచేస్తారు. అంతకుముందు ప్యాలెస్‌లో మోడీకి మాక్రాన్ దంపతులు ప్రైవేట్ విందు ఏర్పాటు చేశారు. 'భాగస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించే చర్య ఇది' అని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చి ట్వీట్ చేశారు. ఈ పురస్కారానికి గానూ భారత ప్రజల తరపున మోడీ కృతజ్ఞతలు తెలియచేశారని పేర్కొన్నారు.
- పెట్టుబడులతో రండి..
రెండు రోజుల అధికార పర్యటనకు ఫ్రాన్స్ వచ్చిన మోడీ గురువారం సాయంత్రం అక్కడి భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. ఫ్రాన్స్‌లో యుపిఐ వాడుకునేందుకు ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. దీంతో నగదు రహిత చెల్లింపులకు భారత్ ఆవిష్కరణకు పెద్ద మార్కెట్ లభించింది. భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అక్కడి భారతీయులకు పిలుపిచ్చారు. పెట్టుబడుల కేంద్రంగా భారత్‌ను అంతర్జాతీయ నిపుణులు గుర్తిస్తున్నారని అన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, కొత్త వ్యవస్థ దిశగా ప్రపంచం ముందుకెళుతున్నపుడు భారత్ పాత్ర, బలం కూడా చాలా వేగంగా మారుతున్నాయని అన్నారు. మార్సిల్లెలో కొత్త భారత కాన్సులేట్‌ను ప్రారంభిస్తున్నట్లు మోడీ ప్రకటించారు. భారత్, ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్ళు నిండాయన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలే ఈ భాగస్వామ్యానికి పునాది అనిమోడీ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా మోడీ పాల్గొన్నారు. అనంతరం ఇరువురు నేతలు ద్వైపాక్షిక సమావేశం జరిపారు.










