ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతులకు రుణాలు మాఫీ చేసేందుకు చేతులు రాని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఏటా లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తోంది. గత ఐదేళ్లలో దేశంలోని కార్పొరేట్లు తీసుకున్న రుణాలు రూ.8,72,778 కోట్లు మాఫీ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కరాడ్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2017-18 నుంచి 2021-22 వరకు ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.6,31,693 కోట్లు, ప్రైవేట్‌రంగ బ్యాంకులు రూ.2,24,855 కోట్లు, విదేశీ బ్యాంకులు రూ.16,230 కోట్లు మాఫీ చేశాయని తెలిపారు.
కేంద్రం అప్పు రూ.155.8 లక్షల కోట్లు.. వడ్డీ రూ.9.4 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వం అప్పు రూ.155.8 లక్షల కోట్లకు చేరిందని, దీనికి వడ్డీనే రూ.9.4 లక్షల కోట్లు అవుతుందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో సిపిఎం ఎంపి వి.శివదా సన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధా నం ఇచ్చారు. 2022-23 సవరించిన బడ్జెట్ అంచనాల్లో కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.155.8 లక్షల కోట్లు కాగా, అందులో రూ.148.8 లక్షల కోట్లు దేశీయ అప్పు, రూ.7 లక్షల కోట్లు విదేశీ అప్పు అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అప్పు కూడా ఏడాదికి ఏడాది భారీగా పెరుగుతుంది. 2017-18లో కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.82.9 లక్షల కోట్లు కాగా, 2018-19లో అది రూ.92.5 లక్షల కోట్లకు, 2019-20లో రూ.105.2 కోట్లకు, 2020-21లో రూ.122.1 లక్షల కోట్లకు, 2021-22లో రూ.138.9 కోట్లకు, 2022-23లో రూ.155.8 లక్షల కోట్లకు పెరిగిపోయింది. దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి)లో అప్పుల వాటా 2017-18లో 48.5 శాతం, 2018-19లో 49 శాతం, 2019-20లో 52.4 శాతం, 2020-21లో 58.7 శాతం, 2022-23 (సవరించిన బడ్జెట్ అంచనా)లో 57.3 శాతం ఉంది. దీనినిబట్టి చూస్తే జిడిపిలో అప్పుల వాటా ఏడాదికి ఏడాది పెరుగుతుంది.
రూ. 82కి పడిపోయిన రూపాయి విలువ
అమెరికా డాలర్‌తో పోల్చితే దేశీయ కరెన్సీ రూపాయి విలువ రూ.82కి పడిపోయిందని పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రూ.82.4845కి రూపాయి విలువ పతనమైందని తెలిపారు.
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం 6.75 శాతం ద్రవ్యోల్బణం నమోదు
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధానంలో దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల స్పష్టమైంది. 2022-23 (ఏప్రిల్- ఫిబ్రవరి) మధ్య 6.75 శాతం వినియోగదారు ధరల సూచిక-కంబైన్డ్ (సిపిఐ-సి) ద్రవ్యోల్బణం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. 2021-22లో సిపిఐ-సి ద్రవ్యోల్బణం 5.51 శాతం ఉందని పేర్కొన్నారు.
వలస కార్మికులపై దాడుల గణాంకాలు లేవు : కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్
దేశంలో వలస కార్మికులపై దాడులు, రాష్ట్రాలు తీసుకున్న చర్యలు, కార్మికులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలస వెళ్లడం వంటి పుకార్లపై ఎటువంటి డేటా కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద్ రారు తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. హింసను ప్రేరేపించే అవకాశం ఉన్న నకిలీ వార్తలు, పుకార్ల ప్రసారంపై నిఘా ఉంచేందుకు, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కు 2018 జూలై 4న ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు.
3.90 శాతం నుంచి 2.92 శాతానికి తగ్గిన వ్యవసాయ బడ్జెట్
కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖల బడ్జెట్ కేటాయింపులు తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021-22లో వ్యవసాయ బడ్జెట్ 3.90 శాతం నుంచి 2022-23లో 3.15 శాతానికి, 2023-24లో బడ్జెట్‌లో 2.92 శాతానికి తగ్గిందని తెలిపారు.
ఏపిలో 275, తెలంగాణలో 297 వెటర్నరీ వైద్యుల పోస్టులు ఖాళీ
ఏపిలో 275, తెలంగాణలో 297 వెటర్నరీ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మత్స్య, పశువర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపిలో 1,781 వెటర్నరీ వైద్యుల మంజూరు పోస్టులు కాగా, అందులో 275 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో 1,223 వెటర్నరీ వైద్యుల మంజూరు పోస్టులు కాగా, అందులో 297 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.










