- తూడు తొలగింపునకే నిధుల మంజూరు
- ప్రభుత్వ తీరుపై రైతుల్లో వ్యతిరేకత
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : గోదావరి కాలువల ఆధునీకరణ ప్రశ్నార్థకంగా మారింది. కాలువల్లో తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు టెండర్ల ప్రక్రియకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే కాలువల ఆధునీకరణ సరిగా లేక రైతులు ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆధునీకరణ పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచే సాగునీటి కాల్వలకు నీరు విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలో 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయకట్టు శివారు ప్రాంతాలకు సాగునీరు అందించాలంటే కాలువల పూడిక తీతతో పాటూ, లాకుల మరమ్మతులు, కాలువ గట్ల పటిష్టత తదితర ఆధునీకరణ పనులు తప్పనిసరి. కేవలం కాలువల్లో తూడు తొలగింపు పనులను మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఏడాది కాలువల ఆధునీకరణ, కాలువల పూడికతీత పనులకు రూ.100 కోట్లతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ఏడాది కాలువల్లో తూడు తొలగింపునకు రూ.17 కోట్లను మాత్రమే మంజూరు చేసింది. ఈ మేరకు టెండర్లను పిలిచేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. నవంబరులో భారీ వర్షాలు, వరదల నుంచి రైతులను రక్షించేందుకు ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 1న కాల్వలకు నీటి విడుదలకు రంగం సిద్ధం చేసింది. పూడిక తీత పనులకు 17 రోజులు మాత్రమే సమయం ఉంది. టెండర్లు ప్రక్రియతో పాటు తూటు కాడ తొలగింపు పనులు సైతం ఈలోగా పూర్తి చేయాలి. ఆచరణలో ఇది సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.
ముందుకు రాని కాంట్రాక్టర్లు
నీటి పారుదల శాఖలో ఒకసారి పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ రెండో సారి ముందుకు రాని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో నీరు- చెట్టు పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదు. దీంతో టెండరు వేసేందుకు ముందుకు రాలేకపోతున్నామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. మూడేళ్ల నుంచి చేపట్టిన పనులకు సుమారు రూ.100 కోట్లు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీని కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయిందని వారంటున్నారు.
ఆధునీకరణ లేకుంటే అవస్థలే...
కాలువల ఆధునీకరణ పనులు లేకుంటే రైతులకు కష్టాలు తప్పేలా లేవు. ఖరీఫ్ కాలంలో తుపానులు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో గోదావర వరదలు కూడా వస్తాయి. ప్రతిఏడూ కాలువల ఆధునీకరణ పనులు జరగకపోవడంతో రైతులు తమ పంటలను కోల్పోతున్నారు. ఈ ఏడాది తూడు తొలగింపు పనులు మాత్రమే చేపడితే ఎలాంటి లాభమూ ఉండదని రైతులు అంటున్నారు.
టెండర్ల ప్రక్రియ ప్రారంభం
తూర్పు, మధ్య డెల్టా కాల్వల పరిధిలో రూ.17 కోట్లతో తూడు తొలగింపునకు ప్రభుత్వం తాజాగా అనుమతులు జారీ చేసింది. టెండర్ల ప్రక్రియను ప్రారంభించాం. త్వరలోనే పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటంతో నీరు విడుదల చేసినప్పటికీ తూడు తొలగింపునకు ఇబ్బందులు ఉండవు. జూన్ 1 నుంచి కాల్వలకు నీరు విడుదల చేస్తాం.
- జి. శ్రీనివాసరావు ఎస్‌ఇ, నీటి పారుదల శాఖ, తూర్పుగోదావరి జిల్లా










