చిరంజీవి శ్రీ వశిష్ఠ వశిష్ఠుడుగా నాకు పరిచయం కాలేదు. సత్కవి, సజ్జనుడూ అయిన సోమేపల్లి వెంకటసుబ్బయ్య కుమారుడుగా పరిచయమయ్యాడు. తండ్రికి తగ్గ కొడుకుగా కవి అయ్యాడు. తన తొలి కవితా సంపుటిలోనే వైవిధ్యభరితమైన కవితలతో మన ముందుకు వస్తున్నాడు వశిష్ఠ. వలస కూలీల వేదనను, గిరిజనుల బాధల్ని, పెట్టుబడి సామ్రాజ్యం పీడనల్ని, మనువు రాతల పట్ల నిరసనల్ని, రాజకీయాల పట్ల చురకల్ని, మత విద్వేషాల పట్ల ఆవేదనను తన కవిత్వానికి వస్తువులుగా మలచుకొన్న ఈ కవి ప్రధానంగా కులమత భేదాలు లేని సమాజాన్ని, మానవత్వం నిండిన మనిషిని కలగంటున్నాడు. అదే సమయంలో యాంత్రికంగా సాగిపోతున్న పరుగుపందాల మధ్య కోల్పోతున్న సజీవ క్షణాల గురించిన ఆవేదన కనిపిస్తుంది. కన్నబిడ్డల చదువుల్ని, ఆశల్ని, కలల్ని రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించే తల్లిదండ్రులు, వారి వల్ల వేదన పాలవుతున్న బిడ్డలు, బిడ్డల చదువుల కోసం అడ్డాలో చెమటగా కరిగిపోయే తండ్రులు, అరచేతిలో ప్రపంచాన్ని ఆవిష్కరించుకొని, ఆ ప్రపంచంలో కన్నతల్లికి చోటివ్వలేకపోతున్న బిడ్డలు - అందరినీ మనముందు నిలబెట్టాడు కవి. మతం పూసుకున్న మనుషుల్ని తయారు చెయ్యటం, విద్వేష విషాన్ని నూరిపొయ్యటం ఆధునిక రాజకీయ విద్య. శాంతియుత సహజీవనం అనేది భారతీయాత్మ. అయితే దాన్ని ధ్వంసించే శక్తులు, యుక్తులు విజృంభించటం నేటి విషాదం. 'అన్ని రక్తాలూ ఒకటి కాదనటం', వర్గాలను విడదీసి విరగ్గొట్టటం', 'చూపుడు వేలు గల విగ్రహాలను విరగ్గొట్టటం' ఈ నేపథ్యంలో 'గుండెలు తెగిన జెండాను చూస్తున్నాడు కవి. జెండా కన్నీటిని 'తుడుస్తావా?' అని ఈ దేశ పౌరుణ్ణి ప్రశ్నిస్తున్నాడు.
నవ్యాంధ్ర రాజధాని కోసం ప్రభుత్వం అక్కడి రైతుల నుంచి సుమారు 33 వేల ఎకరాలు సమీకరించింది. బదులుగా కొన్ని నివాస, వాణిజ్య స్థలాలు వాళ్లకు కేటాయించింది. అయితే రాజధాని ఉట్టికీ స్వర్గానికీ కాకుండా పోయింది. రాజధాని కావాలని అక్కడి రైతులు అడగలేదు. వాళ్ల భూములు ప్లాట్లుగా మారినాకే మొదలైంది అసలైన దుఃఖం.
'ఉన్న కన్నీళ్లకు తోడు ఇప్పుడొక కొత్త దుఃఖం
మనుషుల్ని ప్రాంతాలుగా
ప్రాంతాల్ని కులాలుగా
రంగులు పూసిన చేతులు చేసిన దుఃఖం'
రాజధాని స్వప్నాన్ని అపహాస్యం చెయ్యటానికి కారణమేమిటి? ఆ ప్రాంతం ప్రజలు చేసిన నేరమేమిటి? మనుషుల మీద కులాల ముద్ర వేసి, అభివృద్ధిని నేలమట్టం చేయ్యటమేమిటి? ఈ ప్రశ్నలన్నీ 'మరొక దుఃఖం' చదివినాక తప్పకుండా మెదులుతాయి. ఎవరు వినగలరు 'ఆకు రాలిన చప్పుడు'? 'రెక్కలు ముడిచిన పావురం మాటలు'? చలం అన్నట్టు 'కాలికింద నలిగిన చీమల కాళ్లు విరిగిన చప్పుడు'? ఎడతెరిపి లేని నగర ఘోష మధ్య ఒంటరి గదిలో, లోపలి వెలితిలో, పంచేంద్రియాలతో ఆత్మిక, భౌతిక ప్రకంపనల్ని పసిగడుతున్నాడు కవి. మిక్కిలి సున్నితమైన మనస్సు ఉంటేనే గాని మౌనం సాధ్యం కాదు. మౌనంలో ఉంటేనే గాని చిరుగాలి సవ్వడినో, ఆకురాలిన చప్పుడునో వినటం సాధ్యం గాదు. జెన్ కవులు సాధించింది అదే. విశ్వంలో మనిషి - ప్రకృతి మధ్య అంతస్సంబంధాన్ని గుర్తించటం కవులకే గాదు, మనుషులందరికీ ఆత్మికావసరమే.
'వెతుక్కోవడం' వంటి కవితలు చదివినప్పుడు ఈ కవిలో ఉద్బుద్ధమవుతున్న తాత్వికత గోచరిస్తుంది. 'మనల్ని మనం వెతుక్కోవాలంటే/ మనల్ని మనం కోల్పోతుండాలి కదా ! ' అంటున్నాడు. నిజానికి ఆధునిక మానవుడు ఏ జీవన మాధుర్యం కోల్పోతున్నాడో తెలుసుకోవటం లేదు. ఏ సారాంశం కోసం తపించాలో కూడా తెలుసుకోవటం లేదు. భౌతిక లాలసలో తిరుగుడు పడుతూ బతుకు సంతలో తనంతట తనే తప్పిపోతున్నాడు. మనలో పేరుకున్న మడ్డిని తొలగించుకున్నప్పుడే చేర్చుకోవాల్సిన సారం అర్థమవుతుంది.
ఊహాశాలి ఈ కవి. చంద్రుడి గురించిన వర్ణనలో నూతనత్వం చూడండి. 'ఈ పాటికే కథలతో చెరువు మీద వాలాల్సిన అతిథి/ చుక్కల్ని కప్పిన దీపాల దారిలో తప్పిపోయాడేమో / లేదా అదే దీపంలో కలిసిపోయి/ ఎక్కడో స్మ ృతి కవితగా రాలాడేమో'. 'అప్పుడప్పుడూ...' కవిత మనిషికి దుఃఖం ఎంత అవసరమో చెప్తుంది. 'అప్పుడప్పుడూ ఏడవాలి/ కొద్దిగా బరువుల్ని జార్చుకోడానికే కాదు/ జ్ఞాపకాల్ని ఇంకొంచెం మోయడానికి/ జీవితాన్ని ఇంకొంత కొలవడానికి/ కొన్ని విత్తనాల్ని దుఃఖంతో నాటడానికి'. దుఃఖమనేది భారాన్ని దించుకోవడానికి మాత్రమే కాదు. జ్ఞాపకాల భారాన్ని ఇంకొంచెం మోయడానికి, జీవితాన్ని ఇంకొంత కొలవడానికి కూడా అని చెప్పటం నూతన అభివ్యక్తి. కవితలోని మూడు శకలాల్లో ముగ్గురి కోణం నుంచి విషయాన్ని వ్యక్తం చేయటం అనే కొత్త రూపాన్ని ఎంచుకున్నాడు 'ఇద్దరి కథ కాదు' కవితలో. కులాల మధ్య ఏర్పడిన అపనమ్మకాన్ని తొలగించుకోలేకపోవటం పట్ల ఆవేదనను, అందరూ కలసిపోవాలన్న ఆశను వ్యక్తం చేసిన కవిత ఇది. రెండు వైపుల వారి వాదాలు, దూరాల్ని తొలగించుకొని పచ్చపచ్చగా కొత్త ఊపిర్లు అందుకోవాలన్న కవి కోరిక ఇందులో వ్యక్తమయ్యాయి.
'మీసం ముద్దు'లాంటి సరళమైన, స్వభావోక్తి సుందరమైన కవితలు రాయగలిగినా ఒక్కొక్క చోట ఈ కవి తనకి మాత్రమే అర్థమైన విషయం చెపుతాడు. అటువంటి చోట్ల పాఠకుడికి కూడా అర్థమయ్యే సూత్రం కాస్త అందిస్తే అస్పష్టతా మేఘాలు తొలగిపోతాయి. ముందు ముందు ఈ వర్ధిష్ణువు కవితానిర్మాణంలో తెగిపోని భావధార గురించి, అలంకారికతలో భావచిత్రాల కుదిరిక గురించి మరి కాస్త శ్రద్ధ తీసుకోగలడు. విభిన్నమైన వస్తువుల్ని తీసుకొని కవితాశిల్పాలు చెక్కుతున్న ఈ కవి 'ఇప్పటికైతే వట్టి మట్టిముద్దని మాత్రమే' అని వినమ్రంగా చెప్పుకుంటున్నాడు. 'కాలం జరిగాక తవ్వి చూస్తే శిలగా మిగులుతానో/ శిల్పమై ఎదురొస్తానో/ శిలాజంగా దొరుకుతానో' అంటున్నాడు. కానీ చక్కని శిల్పమై మనకు ఎదురొస్తాడన్న నమ్మికతో ఈ కవి కుమారుడిపై శుభాక్షతలు చల్లుతున్నాను.
- పాపినేని శివశంకర్










