ప్రజాశక్తి - పాడేరు టౌన్ (అల్లూరి సీతారామరాజు జిల్లా):అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలను శతకం పట్టులో కొలువుదీర్చే కార్యక్రమంతో నిర్వాహకులు మూడురోజుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అమ్మవారిని శతకం పట్టు వద్దకు తీసుకువెళ్లేందుకు వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలం నాయుడు, జెసి జె.శివశ్రీనివాసు, ఐటిడిఎ పిఒ వి.అభిషేక్, జడ్‌పి చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎపి మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ నర్సింగరావు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పిన్నయ్యదొర, కొట్టగుళ్లి సుబ్బారావు, నవర కొండబాబు తదితరులు ఉత్సవ విగ్రహం, పాదాలను ఆలయం నుంచి ఊరేగింపుగా మెయిన్ బజార్ వద్ద ఏర్పాటు చేసిన శతకంపట్టుకు తీసుకువచ్చి అక్కడ కొలువుదీర్చారు. ఊరేగింపులో డప్పు కళాకారులు ఆకట్టుకున్నారు. థింసా నృత్యాలు అలరించాయి. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.