Jul 08,2023 13:04

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు మండలంలోని దేవపురం పంచాయతీ ఢీకొత్తూరు గ్రామంలో  తుపాకీ కాల్పుల్లో గిరిజన యువకుడు కొండపల్లి కొండలరావు (22) బలి అయ్యాడు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటనలో గిరిజన యువకుడు మరణించడం ఈ ప్రాంతంలో కలకలం రేపింది. గ్రామ వలంటీర్  బాలరాజు విలేకరులకు తెలిపిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఈ ఢీకొత్తూరు గ్రామంలో మృతుడు కొండలరావు అతని సోదరుడు, తల్లి, కలసి నివసిస్తున్నారు. వీరి ఇంటి పొరుగున ఉన్న కొండపల్లి రామకృష్ణ అనే వ్యక్తి దంపతులతో శనివారం సాయంత్రం వీరికి ఘర్షణ జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆ తర్వాత రాత్రి సుమారు 11 గంటల సమయంలో తుపాకీ పాల్పులు జరగడం కొండ లరావు మృతి చెందడం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? ఉద్దేశపూర్వకంగా ఇది వర్గాల మధ్య ఘర్షణలో భాగంగా కాల్పులు జరిగాయా? అన్న సంగతి పోలీసుల దర్యాప్తులో నిర్ధారించాల్సి ఉంది. మృతుడు కొండలరావు ఇంటర్ తో చదువు ఆపేసి గ్రామంలోనే వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. ఇతని తండ్రి గతంలోనే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని పాడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సిబ్బంది సందర్శించారు. కొండలరావు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియవలసి ఉంది.