Apr 25,2023 16:45
  •  ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
  •  బాధిత మహిళలకు పరామర్శ

ప్రజాశక్తి పాడేరు, జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లి మహిళలపై గ్రేహౌండ్స్‌ పోలీసుల అత్యాచారం కేసులో కోర్టు తీర్పు వెలువడినా తదుపరి చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాకపల్లి గ్రామాన్ని సోమవారం సాయంత్రం ఆయన సందర్శించి బాధిత మహిళలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ..16 ఏళ్ల తర్వాత వాకపల్లి కేసులో వచ్చిన తీర్పుపై 26 రోజులు దాటినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం అన్యాయమన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కేసుల్లోగానీ, మహిళలపై జరిగిన అత్యాచార కేసుల్లోగానీ కేసు నమోదైన 21 రోజుల్లోనే స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం.. వాకపల్లి అత్యాచార ఘటనపై కోర్టు తీర్పు ఇచ్చినా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం విచారకరమని అన్నారు. 'వాకపల్లి' కేసును దర్యాప్తు చేసేందుకు నాటి ప్రభుత్వం నియమించిన విచారణ అధికారులు శివానందరెడ్డి, ఆనందరావు కేసు దర్యాప్తు సక్రమంగా చేయలేదని, సాక్ష్యాలను రూపుమాపారని కోర్టు స్పష్టం చేసినా వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోకుండా ప్రభుత్వం మౌనందాల్చడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వాకపల్లి కేసులో ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, బాధిత మహిళలకు నష్టపరిహారం చెల్లించాలని, ఈ కేసు విచారణ సక్రమంగా నిర్వర్తించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. వాకపల్లి బాధితులను పరామర్శించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, నాయకులు కిల్లో సురేంద్ర, బోనంగి చిన్నయ్య పడాల్‌, పాలికి లక్కు, సాగిన ధర్మన్న పడాల్‌ ఉన్నారు.

2