Nov 15,2023 11:13
  • షెడ్యూల్‌ ఏరియాలో ఆదివాసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
  • ఆదివాసి గిరిజన సంఘం ధర్నాలో వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : షెడ్యూల్‌ ఏరియాలోని ఆదివాసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం విజయవాడలోని ధర్నా చౌక్‌లో ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతంలోని భాషా వలంటీర్లు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్‌ ఏరియాలో గిరిజనులకు వందశాతం రిజర్వేషన్‌ కల్పించే జిఓ నెం.3ను తక్షణం పునరుద్ధరించాలని కోరారు. అవసరమైతే ఈ మేరకు చట్టసవరణ చేయాలని సూచించారు. అలాగే, గిరిజనులకు వారి మాతృభాషలో బోధించేందుకు నియమించిన భాషా వలంటీర్లకు కనీస వేతనంగా రూ.26 వేలు చెల్లించాలని కోరారు. ఇటీవల సీతంపేట నుండి విజయవాడకు నిర్వహించిన బస్సు యాత్ర సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని సమస్యలను స్వయంగా పరిశీలన చేసినట్లు చెప్పారు. అనేక ప్రాంతాల్లో భాషా వలంటీర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తెచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్‌ మీడియం పేరుతో మాతృభాషలో విద్యా బోధనను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. మాతృభాషలో విద్యాబోధన సరైందని ప్రపంచ అనుభవాలు చెబుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్‌ మీడియంను బలవంతంగా రుద్దుతోందన్నారు. త్రిపుర రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఆదివాసులు మాట్లాడే భాషలో విద్యాబోధన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని భాషా వలంటీర్లకు ప్రభుత్వం కేవలం రూ.5 వేలు వేతనంగా ఇవ్వడం సరైందికాదన్నారు.

శ్రీనివాసరావు

కేంద్రం నుండి సర్వశిక్షకు వచ్చే నిధులతోపాటు ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. భాషా వలంటీర్లు తమ సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటాలకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లోని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలన్నింటిలో వైసిపినే ప్రజలు గెలిపించారని, అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదన్నారు. భాషా వలంటీర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా కేవలం పుస్తకాల ముద్రణ కోసమే ఖర్చు చేయడం తగదన్నారు. పుస్తకాలు ఇచ్చి చదువు చెప్పే టీచర్‌ లేకుండా ఎలా లక్ష్యం నెరవేరుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ఉపాధి అవకాశాల్లో 100 శాతం గిరిజనులకే ఇచ్చేందుకు వున్న జిఓ నెంబర్‌ 3ను పునరుద్ధరించేలా చట్టసవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజన్నదొర డిప్యూటీ సిఎంగా వున్నా ఏమాత్రం సమస్యల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లోని హాస్టల్స్‌, స్కూల్స్‌లో ఇస్తున్న మెనూ ఏమాత్రం సరిపోవడం లేదని, పెంచాలని డిమాండ్‌ చేశారు. భాషా వలంటీర్లను రెన్యువల్‌ చేసే అంశంలో పైరవీలకు అవకాశం లేకుండా రెన్యువల్స్‌ చేయాలన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి అప్పల నర్సయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి బాలదేవ్‌ మాట్లాడుతూ.. జిఓ నెంబర్‌ 3కు చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రత్యేక డిఎస్‌సి వేయాలని, భాషా వలంటీర్లకు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, సుబ్బరావమ్మ తదితరులు మాట్లాడారు.