ప్రజాశక్తి - పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంట్లమామిడి సమీపంలోని కోమలమ్మ పనుకు దగ్గర ఉన్న మలుపులో కారు లోయలోకి బోల్తా పడటంతో ముగ్గురు దుర్మరణం చెందారు. వీరిలో భార్యాభర్తలు ఉన్నారు. పోలీసులు తెలిపన వివరాల ప్రకారం.. విశాఖపట్నంకు చెందిన భార్యభర్తలు సుబ్బారావు, మహేశ్వరి, వారి సమీప బంధువు పూర్ణచంద్రరావుతో కలిసి కారులో డ్రైవర్‌ను వెంట తీసుకొని ముంచింగిపుట్టు మండలం కిలగడ గ్రామంలో జరిగిన గిరిజన జాతరకు వచ్చారు. జాతర ముగిసిన అనంతరం బుధవారం రాత్రి విశాఖ వెళ్తుండగా కోమలమ్మ పనుకు సమీపంలో మలుపు వద్ద కారు బోల్తా కొట్టింది. సుమారు 20 అడుగుల దిగువన ఉన్న లోయలోకి కారు పడిపోవడంతో కారు డ్రైవర్‌తోపాటు మహేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సుబ్బారావు, పూర్ణచంద్రరావును 108 వాహనంలో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. సుబ్బారావు ఆస్పత్రిలో చేరేసరికి మృతి చెందారు. సుబ్బారావు విశాఖపట్నంలోని ఎల్‌ఐసి కార్యాలయంలో ఎఒగా విధులు నిర్వహిస్తున్నారు.