న్యూఢిల్లీ : మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల్ని బిజెపి దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ మడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం ప్రకటించడంపై జోక్యం చేసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. న్యూఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు జైరాం రమేష్, కెసి వేణుగోపాల్, అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికల సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థల్ని బిజెపి దుర్వినియోగం చేస్తుందని, ఈ రెండు రాష్ట్రాల్లో బిజెపికి ఓటమి తప్పదని దాని చర్యలే తెలియజేస్తున్నాయని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో 'కేంద్ర సంస్థల దుర్వినియోగం'పై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇడి, ఐటి శాఖ బిజెపికి ప్రధాన అస్త్రాలని కేసి వేణుగోపాల్ అన్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో 100 మందికి పైగా కాంగ్రెస్ అభ్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించాయని వేణుగోపాల్ గుర్తు చేశారు. 'ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రుల ప్రతిష్టను దెబ్బతీయడమే బిజెపి లక్ష్యం' అని అన్నారు. బిజెపివి ప్రతీకార రాజకీయాలని విమర్శించారు. ప్రస్తుతం ఆరోపణలు వస్తున్న మహాదేవ్ యాప్‌పై చర్యలు తీసుకున్నది ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని సింఘ్వీ తెలిపారు. ఈ స్కామ్‌పై 70కు పైగా కేసులు నమోదు చేసి 450 మందికి పైగా అరెస్టు చేశారని అన్నారు.