- బడ్జెట్‌లో లేకున్నా భారీగా ఖర్చులు
- బడ్జెట్‌లో ఉన్న వాటిపై పట్టని శాఖలు
- వేస్ అండ్ మీన్స్‌కే 55,302 కోట్లు
- తేలని లెక్కలన్నీ ద్రవ్య నిర్వహణ పేరుతోనే
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఆర్థిక గణాంకాలు గతి తప్పుతున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలకు, వాస్తవంగా అమలుకు మధ్య సమన్వయం లోపిస్తోంది. పదేపదే ఈ అంశాలను ఎత్తి చూపిస్తున్న కాగ్... తాజాగా ఆగస్టు గణాంకాల్లో కనిపించిన లోటుపాట్లను పేర్కొంది. ఆమోదించిన వ్యయం జరగకపోవడం, ఆమోదం లేని ఖర్చులు పెరిగిపోవడం వంటి అంశాలు చోటుచేసుకుంటున్నట్లు కాగ్ పేర్కొంది. ఇది బడ్జెట్ నిర్వహణకు ఆమోద యోగ్యం కాదని అభిప్రాయపడింది.
ఆగస్టు వరకు తేల్చిన లెక్కల మేరకు ఏకంగా రూ.62,568 కోట్లు బడ్జెట్ ఆమోదం లేకుండా ఖర్చు చేసినట్లు వెల్లడైంది. ఈ వ్యయంలో చేసిన అప్పులు తీర్చేందుకే సింహభాగం వెచ్చించినట్లు తేలింది. అత్యవసర పరిస్థితుల్లో రిజర్వ్‌బ్యాంకు నుంచి చేబదులుగా తీసుకునే వేస్ అండ్ మీన్స్ రుణాన్ని చెల్లించేందుకే ఐదు నెలల్లో ఏకంగా రూ.55,303 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ చెల్లింపులు మొత్తం ద్రవ్య నిర్వహణ పేరిట ఆర్థికశాఖకు కేటాయించిన నిధుల నుంచే ఖర్చు చేసినట్లు తేలింది. ఇవి కాకుండా ఓవర్‌డ్రాఫ్ట్ చెల్లింపులకు కూడా మరింత వ్యయం చేయాల్సి వచ్చిందట. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు చేసే వ్యయం కూడా భారీగానే ఉన్నట్లు తేలింది. ఒక్క ఆగస్టులోనే గతంలో తీసుకున్న బహిరంగ మార్కెట్ రుణాల వాయిదాల కోసం రూ.875 కోట్లు చెల్లించినట్లు తేలింది.
గత కొన్ని నెలల మాదిరిగానే ఆగస్టులో కూడా బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేని పరిస్థితి పునరావృతమైంది. రూ.37 వేల కోట్లకుపైగా నిధులు ఆగస్టు వరకు ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ, అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు జరగలేదని కాగ్ పేర్కొంది. అలాగే మరికొన్ని పద్దుల్లో బడ్జెట్ ఆమోదానికి భిన్నంగా రూ.1,414 కోట్లు తక్కువగా ఖర్చు చేసినట్లు తేలింది.
ఆర్థిక నిర్వహణ మార్గదర్శకాల్లో అనేక అంశాలను ఆర్థికశాఖ పట్టించుకోవడం లేదని కాగ్ ఆక్షేపించింది. ప్రధానంగా బడ్జెట్, వ్యయం, ఇతర అంశాలకు సంబంధించి ఐదు మార్గదర్శకాలను అధికారులు అమలు చేయడం లేదని, వీటిపై పదేపదే తాము చేస్తున్న సూచనలు వ్యర్థమవుతున్నాయని కాగ్ పేర్కొనడం కొసమెరుపు.










