Oct 03,2023 15:42

ప్రజాశక్తి-భట్టిప్రోలు(బాపట్ల) : కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రిని క్యాబినెట్‌ నుంచి భర్తరఫ్‌ చేయాలని, రైతుల మరణాలకు కారకుడైన అతని కుమారుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మంగళవారం భట్టిప్రోలు మండల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మండల తహశీల్దార్‌ డి.వెంకటేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల సమైక్య నాయకులు మాట్లాడుతూ రైతు, కార్మిక నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ శాంతియుతంగా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ 700 మందికి పైగా రైతులు ప్రాణాలను కోల్పోవడం జరిగిందని అంతేగాక లఖింపూర్‌ లో శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తున్న రైతులపై కేంద్ర సహాయ మంత్రి తనయుడు కారుతో తొక్కించి రైతుల ప్రాణాలను బలి తీసుకున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయా కుటుంబాలను ఆదుకోకపోగా అక్రమ కేసులను బనాయించారని వారు మండిపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, కేంద్ర సహాయ మంత్రిని క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని, మంత్రి తనయుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, రైతుల, కార్మిక నాయకుల పై బనాయించిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు, సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, కె. రామస్వామి, ఏ ఐఎఫ్టీయు న్యూ జిల్లా నాయకులు మర్రివాడ వెంకటరావు, సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు గొట్టుముక్కల బాలాజీ, వేమూరు నియోజకవర్గ కార్యదర్శి బండారు శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు మరుగుడు సత్యనారాయణ, జి. నాగరాజు, దీపాల సత్యనారాయణ, సిపిఐ (ఎంఎల్‌) నాయకులు సీతారామయ్య, కోటేశ్వరరావు, దొంతు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.