Jul 27,2023 14:17

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ముసారాంబాగ్‌ బ్రిడ్జ్‌ వద్దకు వెళ్లనున్నారు. భారీ వర్షాలతో నగరంలోని నాళాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పెద్దమొత్తం నీరు హుస్సేన్‌సాగర్‌కు చేరుతున్నది. ఇప్పటికే ట్యాంక్‌బండ్‌ పూర్తిగా నిండిపోవడంతో తూమ్‌ల ద్వారా వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు వెళ్తున్నది. అదేవిధంగా ఎగువన కురుస్తున్న వానలతో మూసీకి వరద పోటెత్తింది. జంట జలాశయాలకు భారీగా వరద వచ్చిచేరుతుండటంతో గేట్లు ఎత్తివేసి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ కాలువ నిండుగా ప్రవహిస్తున్నది. ఈ క్రమంలో ముసారంబాగ్‌ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తున్నది.