Nov 07,2022 07:23

రసజ్ఞ జాతీయ నాటక ఉత్సవం 2022 లో భాగంగా అక్టోబరు 28వ తేదీన విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో - మధ్యప్రదేశ్‌కు చెందిన ఇంద్రావతి థియేటర్‌ ప్రదర్శించిన విభిన్నమైన నాటకం 'సరూ.' ఇది హిజ్రా పాత్రలతో నడిచిన మానవీయ ప్రదర్శన. ఇన్నాళ్లూ మనలోని చాలామంది ఆలోచనా పరిధిలోకి రాని అంశాలను చాలా గొప్ప ప్రదర్శనాభివేశంతో కళ్ల ముందుంచిన నాటకం. ప్రేక్షకుల గుండెల్లో ఒక చెమరింపుని, హృదయంలో ఒక మానవీయ స్పర్శనూ కలగించిన ప్రదర్శన ఇది.

నాటకం ఇతితృత్తం ఇదీ.. : రోజులు మామూలుగా నడుస్తున్న సమయంలో ఒకరోజు హిజ్రా అయిన సుశీలకు చెత్తకుప్ప తొట్టెలో ఒక ఆడ శిశువు కనిపిస్తుంది. ఇంటికి తీసుకువస్తే తన సంరక్షకురాలు అయిన 'అమ్మ'- 'మనమే ఇటు అటు కానీ మూడో రకం మనుషులం. ఈ బిడ్డ పెరిగి పెద్దయితే మనలాగే అడుక్కుంటుందా?' అని ప్రశ్నించి ఎక్కడ దొరికిందో అక్కడే వదిలి రమ్మంటుంది. అది వాళ్ళిద్దరి మధ్యా వాదోపవాదాలకు దారి తీసి చివరకు అమ్మ, ఆ శిశువును తమతో ఉంచుకోవడానికి అంగీకరిస్తుంది. రోజులు మామూలుగా గడుస్తుంటాయి.
ఒకరోజు ఆ ఆడబిడ్డ స్కూలు నుంచి తిరిగి రాకపోవడంతో అందరూ ఆందోళన చెందుతారు. సుశీల ఆ విషయం పోలీస్‌ స్టేషన్లో రిపోర్ట్‌ చేయడానికి వెళుతుంది. అక్కడ పోలీసు ఆమెతో చాలా అమర్యాదగా వ్యవహరిస్తారు. ఫిర్యాదు తీసుకోవడానికి చిరునామా, తల్లిదండ్రుల పేర్లు వగైరా అడుగుతాడు. తల్లీ తండ్రిగా ఆడపేర్లు చెప్పేసరికి 'ఎప్పటినుంచి మూడో రకం (ట్రాన్స్‌ జెండర్‌) మనుషులు కూడా బిడ్డలను కంటున్నారని హేళన చేస్తాడు. ఆమెతో అసభ్యంగా వ్యవహరించి, శారీరకంగా హింసించి పంపేస్తాడు. ఇంటికి వెళ్తున్న తోవలో రోడ్డు పక్కన, పసి బాల 'సరూ' రక్తమోడుతున్న శరీరంతో కనిపిస్తుంది. ఇంటికి తీసుకెళ్ళిన కొద్దిసేపటికి సరూ కళ్ళు మూస్తుంది. ఇంటిలో దు:ఖ వాతావరణ అలుముకొంటుంది. చివరలో ఆ మూడో రకం మనుషులకు సరూ హంతకుడెవరో తెలుస్తుంది. వాళ్లు అతడిని మట్టికరిస్తారు.
ఈ నాటిక మూడో రకం మనుషుల జీవితాలు ఎలా ఉంటాయో, వాళ్ళ బాధలు, పైకి కనిపించని మానసిక గాయాలను చూపే ఒక మచ్చు తునక. ఈనాటికీ కొందరు తమ ఇళ్ళలో జరిగే వేడుకలకు ఈ మనుషులు వచ్చి ఆశీర్వదించాలని ఆశిస్తారు కానీ, వారికి గౌరవం, సమాన హక్కులు ఇవ్వడానికి ఇష్టపడరు. వారి కన్నీళ్లు, వీళ్ళ నవ్వుల మధ్య ఎక్కడో ఆవిరి అయిపోతాయి. వీళ్ళు తమ కష్టాలు బాధలు అవమానాలను, కన్నీళ్ళను, రంగు పులుముకున్న ముఖంలో ఎక్కడో కనబడకుండా దాచేస్తారు.
ఇప్పటికీ అనాధ ఆడ శిశువుల జననం ఈ సమాజంలో ఒక విషాదమే. ఒక కళంకమే! అయితే గర్భస్రావం లేదా కుప్ప తొట్టి పక్కనో, ప్రసవించబడి, 'వ్యర్థం'లా వదిలేయబడ్డ శరీర మలిన శరీరాలు మనకు కనిపిస్తుంటాయి.
ఈ నాటికలో ఈ వర్గం వారు అలాంటి శిశువును ఇంటికి తీసుకురావడానికి కారణం- చదివించి ఆ శిశువు కోసం బంగారు కలలు కనడం ఎందుకోసమంటే- ఇకనైనా ఈ సమాజం తన ఆలోచనా సరళిని మార్చుకొని తమతో కలుపుకుంటుందేమోనని ఒక ఆశతో! కానీ ఈ సమాజంలోని కొందరు నరరూప రాక్షసులే సరూ లాంటి వాళ్లను లైంగిక హింసలు పెట్టి, రక్త గాయాలతో పెంటదిబ్బల పైకి విసిరేస్తుంటారు. ఇది వెలిగిపోతున్న వర్తమాన సమాజంలోని ఒక గాఢాంధకార పార్శ్వం. మూడో వర్గం వారి యథార్థ జీవన శకలం. ఆ బిడ్డ పెంపకాన్ని మొదట్లో తిరస్కరించిన ఆ ఇంటి పెద్దని సరూ మరణం తీవ్రంగా కలిచివేస్తుంది. ఆమె గుండెలు బాదుకుని రోదిస్తుంది. అందరూ నిస్త్రాణగా కుప్పకూలిపోతారు. ఆ సమయంలో ఆమెలోని తల్లి హృదయం ఆక్రోశిస్తుంది. దేవుడిని శపిస్తుంది. ఏనాడూ తన జీవితం ఇలా అయినందుకు ఆమె భగవంతుడిని నిందించలేదు. కానీ ఇప్పుడు ఆ బిడ్డకు జరిగిన ఘోర అన్యాయానికి తీవ్రంగా స్పందిస్తుంది. చివరగా సరూని బలాత్కారం చేసింది పాఠశాల వాచ్‌మేన్‌ అని తెలుసుకొని, అతడిపై తమ కసినంతా ప్రదర్శిస్తూ వాడి ప్రాణాలు తోడేస్తారు. తమ ఆవేదన చల్లారక బిగ్గరగా అరుస్తూ ప్రచండ రూపాన్ని ప్రదర్శిస్తారు.
నాటిక ప్రదర్శకులు ఒక వైవిధ్యభరితమైన ఇతివృత్తాన్ని నట శిక్షణకు తీసుకున్న మామూలు విద్యార్థులు. ఆ మూడో రకం మనుషుల్లోని మానవత్వాన్ని, దు:ఖావేశాలను, సహానుభూతిని అత్యంత అద్భుతంగా ప్రదర్శించారు. అందరూ మగవారైనా... అభినయ ప్రదర్శనతో ప్రేక్షకుల్లో చక్కని స్పందన కలిగించడం ఈ నాటిక సాధించిన సామాజిక ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. నాటిక రచన, దర్శకత్వం : శివ్‌ నారాయణ్‌ కుందేర్‌.

- మల్లేశ్వరరావు ఆకుల
79818 72655