- విభజన హామీ... అయినా స్పందించని కేంద్రం...
- మెట్రో రైల్ కార్యాలయం పెట్టేసి చేతులు దులుపుకున్న రాష్ట్రం
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : ఎపి విభజన చట్టం హామీల్లో ప్రధానమైన విశాఖకు రైల్వే జోన్, మెట్రో రైల్ ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలపై కేంద్రంలోని బిజెపి సర్కారు నీళ్లు జల్లుతూ వస్తోంది. 2019 ఎన్నికల సమయంలో విశాఖకు రైల్వే జోన్ అంటూ మోడీ సర్కారు ప్రకటన చేసింది. 2021-2022 బడ్జెట్‌లో ఒక్కపైసా కూడా విదిలించలేదు. వాల్తేరు రైల్వే డివిజన్‌ను ఎత్తేసి ఈ ప్రాంత ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో పనిచేసే రైల్వే ఉద్యోగులనూ మోసం చేసింది. కేంద్రం కోరిన మీదట విశాఖకు మెట్రో రైలుపై రూ.18వేల కోట్లు అవసరమవుతుందని రైల్వే నిపుణులు 2019లో ప్రతిపాదన పంపినా సరే కేంద్రం నుంచి ఇంతవరకూ స్పందన రాలేదు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సైతం మెట్రోపై మౌనం దాల్చింది. విశాఖలోని ఎల్‌ఐసి భవన సముదాయంలో ఎపి మెట్రో రైల్ ప్రాజెక్టు కార్యాలయాన్ని 2020 అక్టోబర్ 26న అప్పటి రాష్ట్ర మునిసిపల్, పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అట్టహాసంగా ప్రారంభించారు. 2024 సంవత్సరానికల్లా మెట్రో పూర్తవుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ప్రకటించారు. కానీ ఆ దిశగా ఒక్క పనీ మొదలవ్వలేదు. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వమూ మెట్రో కార్యాలయం అయితే పెట్టి అంతటితో పనైపోయిందంటూ చేతులు దులిపేసుకుంది. దేశం మొత్తం మీద ఎపి, ఒడిశాలో మాత్రమే మెట్రో రైలు లేని 'అర్బన్ సిటీస్' (పట్టణాలు) ఉన్నాయన్నది స్పష్టమవుతోంది.
75 కిలోమీటర్లు... 4 కారిడార్‌లు...
విశాఖ మెట్రో రీజనల్ డెవలప్‌మెంట్ ఏరియాలో 79.91 కి.మీ. లైట్ మెట్రో రైలు కారిడార్‌లు, 60 కి.మీ మేర మోడ్రన్ ట్రామ్ కారిడార్ల అభివృద్ధి కోసం ఆనాడే మాస్టర్ ప్లాన్, డిపిఆర్ తయారుచేశారు. లైట్ మెట్రో, మోడ్రన్ ట్రామ్‌ల నిమిత్తం రెండు డిపిఆర్‌లు వేర్వేరుగా తయారుచేసి ట్రాఫిక్ ఇతర అంశాలపై అధ్యయనం చేసిన అనంతరం 75.31 కిలోమీటర్లలో 4 కారిడార్లలో 52 స్టేషన్లను ఏర్పాటు చేయాలని నాటి కన్సల్టెంట్‌లు ఎపి ప్రభుత్వానికి, కేంద్రానికి సిఫారసు చేశారు. విశాఖ నగరంలో ఏ సమయంలో ఎక్కడెక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుందీ అన్న ప్రతిపాదనలూ కేంద్రానికి వెళ్లాయి. స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకూ ఒక కారిడార్, గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకూ, తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకూ, కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం వరకూ 4 కారిడార్ల ఏర్పాటుకు అవసరమైన డిపిఆర్ సిద్ధమైంది.
మెట్రో వచ్చే దెప్పుడు? విశ్వనగరం అయ్యేదెప్పుడు ?
ఈ మాటలు విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో తాజాగా వినబడుతున్నాయి. అమరావతి నిర్మాణానికే సాయం ఇవ్వకుండా చాపచుట్టేసిన కేంద్రం ఎపి మెట్రోకు రూ.వేలకోట్లు అందిస్తుందా? అన్నది అనుమానమే. విశాఖ నగరంలో జన సాంద్రత రీత్యా మెట్రో ఏనాడో పరుగులు తీయాలని గత చంద్రబాబు సర్కారు 2016 నుంచీ విశాఖకు మెట్రో అంటూ ఊరిస్తూ వచ్చారు. 2017 డిసెంబరులో మధురవాడ నుంచి గాజువాక 44 కి.మీ మెట్రో వేసేందుకు విజయవాడ-విశాఖ రైల్వే అధికారులతో చంద్రబాబు ప్రభుత్వం చర్చించింది.
అప్పట్లో కిలోమీటరుకు ఖర్చు రూ.200కోట్లుగా అంచనా వేశారు. అంటే 44 కి.మీ కు రూ.8500కోట్లు వ్యయం కానుంది. 2019 ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడేలా 2018 డిసెంబరు నాటికి పనులు ప్రారంభించాలంటే చంద్రబాబు ఆదేశించినా ఒక్కపైసా కూడా కేంద్రం నుంచి రాలేదు. విశాఖలో 2028 సంవత్సరం నాటికి 144 కి.మీ మెట్రో పూర్తికావాలనే లక్ష్యాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన డిపిఆర్ తయారీకి రైల్వే నిపుణులు, ఒఎస్‌డి, సిఎమ్‌డిలను రాష్ట్ర ప్రభుత్వం నియమించాల్సి ఉన్నా ఆ దిశగా 2018 డిసెంబరు నాటికి జరగలేదు. దీంతో డిపిఆర్‌లో అంచనా వ్యయం కూడా తాజాగా రూ.18వేల కోట్లకు పెరిగిపోయింది. 2020లోపు చొరవ చేస్తేనే మెట్రోకు ఈ వ్యయం. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.18వేల కోట్లకు మరో 30శాతం అదనపు ఖర్చు అవుతుందని రైల్వే నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రాథమికంగా విశాఖ మెట్రోపై జరిగిన అధ్యయంలో అండర్ గ్రౌండ్ నుంచి మెట్రో లైన్‌లు వెళ్తున్నప్పుడు పైన ఉన్న భవనాలకు పగుళ్లు ఏర్పడే అవకాశం లేకపోలేదనేది వాదన కూడా ఉంది.










