Jul 17,2023 07:34

ఎప్పటికప్పుడు
ఏ వార్తను మరుగు పరచడానికి
ఏ వార్తను హైలైట్‌ చేయాలో
ఇప్పుడంతా సెంగోల్‌ బుర్రలకి
ఈడీతో పన్నిన విద్య !

బిరుసు గొంతుల మోషా బలంతో
ఫోర్త్‌ ఎస్టేట్‌ పునాది చుట్టూ
బెదిరింపుల బుల్డోజర్లు
కలియదిరుగుతున్నపుడు
వెలుగు చూడాల్సిన దాష్టీకాలు
సంసద్‌ భవంతుల కింద సమాధులు !
సెంట్రల్‌ విస్టానా? శవ పేటికనా?
అని పొరపాటున కూడా అడక్కండి
శవానికి కప్పే కఫన్‌ గుడ్డకు
జియ్యస్టీ కట్టాలని గుర్తొస్తే
సమాధి గొయ్యి బావురుమంటుంది !

జోక్‌ ఇన్‌ ఇండియా జమానాలో
ప్రభు వర్గానికి ప్రశ్నలై ఎదురెళ్లి
ప్రమాదాలనెవరూ కోరి తెచ్చుకోకండి
దేశమంతా వినమ్రంగా ఉండండి
భక్తి మందుకు ప్రజలంతా ఎడిక్ట్‌ కండి
పన్ను చెల్లింపుదారులంతా పవిత్ర
కర్తవ్యాన్ని శ్రమటోడ్చి నిర్వర్తించండి !

టు లెట్‌, ఫర్‌ సేల్‌ - కొత్త స్కీములతో
దానీ బానీ దారుల్లోకి మరలిపోయే
రాయితీ పద్దుల మీద డేగ కళ్ళేవీ పడకుండా
కాషాయ మబ్బుల అడ్డుతెరలు కట్టండి
వాచ్‌ డాగ్‌లు ఏవీ మొరగకుండా
కుర్చీ కాళ్ళకు కట్టి తోకూపేలా వాటిని
మచ్చిక చెయ్యండి !

నిర్భీతి గొంతుతో స్వతంత్రించి
ఏ ఆడకూతురో జర్నలిజం ఉనికి గుర్తుచేస్తే
ఆమె గొంతునొక్కే గోదీ శిష్యుల్ని
ఉదాసీనంగా చూస్తూ నేరస్తులవండి
ఏదో ఫైల్స్‌ పేరుతో వారు వడ్డించే
విద్వేష విషాన్ని ఓటిటిలో చూసి
ఒంటబట్టించుకోండి
చరిత్ర మనకేం నేర్పిందనే సంగతటుంచి
వారు మార్చే టాపిక్‌ ఏమార్పుల్లో
కుశాలగా కుదురుకోండి -

నూరు లక్షల కోట్ల అప్పా.. అని
నోళ్ళెళ్ళ బెట్టకండి
సోషల్‌ మీడియా విసర్జించే
ఒక్కో మారేడుకాయకు మరికొంత మసిపూసి
ప్రచారంలో పెట్టి మురిసిపోండి
జై భారత్‌, జై ఇండియా సరే
జై హింద్‌ అంటూ గొంతు చించుకోండి
'మేరా భారత్‌ మహాన్‌' ఒక్క క్యాప్షన్‌
కింద మీ బిడ్డల భవిష్యత్తును
మీరే సమాధి చెయ్యండి
'మేరా భారత్‌ మహాన్‌' !

- కంచరాన భుజంగరావు,
94415 89602