Apr 17,2023 06:40

అవునులే
నేటి విద్యార్థుల్ని
రేపటి పౌరులుగా నిలబెట్టే వాళ్లం కదా
కూర్చునేందుకు మాకు కుర్చీలెందుకులే
రకరకాల పేర్లతో నెల నెలా
ఎంతో కొంత మా పచ్చదనాన్ని
లాగేసుకుంటూనే వున్నారు
ఒక పక్క ఒరిగి సగం విరిగిన కుర్చీలని
లాగేసుకోవటం మీకో లెక్కా..!?

అయినా
నిలబడి పాఠాలు చెప్పటంలో
మా తరువాతే ఎవరైనా
ఒక జాతిని నిలబెట్టేవాళ్లం కదా
ఒక పౌరసమాజాన్ని ప్రతిష్టించేవాళ్లం
ఎప్పుడు కూర్చోవాలో ఎప్పుడు నిలబడాలో
మీకంటే మాకే బాగా తెలుసు
నరాలు తెగేలా బోధించీ బోధించీ
కడుపులో పేగులు కదిలేలా అరిచీ అరిచీ
అదీ ఏ రాతపూతల కోసమో
అలసిసిన దేహాన్ని కాసేపు అలా కుర్చీలో కుదేస్తాం
మీలెక్క మేమేమీ కుర్చీల కోసం
కుస్తీలు పట్టేవాళ్లం కాదులెండి
కుర్చీని బల్లిలా అంటి పెట్టుకుని
ఐదేళ్ల దాకా ససేమిరా దిగిపోమని
మొరాయించెటోళ్లం కాదులెండి!

అయినా మీ కళ్లకు
పనీపాటా మానేసి
కునికిపాట్లు పడే కుర్చీలు కనిపించవు
చేయాల్సిన ప్రజల పనుల్ని వాయిదా వేసి
నిద్రబల్లలుగా మారిన కుర్చీలు కనబడవు
ఉన్నఫళంగా ఎటూ కదలకుండా
ఏళ్ల తరబడి పదవిలో జోగాడే కుర్చీలు కనబడవు
ప్రజల పట్ల బాధ్యత మరిచి
కుర్చీల కోసమే కుమ్ములాడుకునే
వ్యవస్థా కనబడదు

కూర్చున్నా నిలబడ్డా
నిలువునా మంచులా కరిగినా
నిప్పులా తగలబడినా
ఒక దేశాన్ని నిర్మించి నిలబెట్టే
బోధించే జాతి మాది
మా కుర్చీలే కనిపిస్తాయి మీకు

అయినా
మా ఒంట్లో రక్తాన్నీ నరాల్నీ
లాగేసుకుంటున్నవాళ్లకు
మా ముడ్డి కింద కుర్చీలని
లాగేసుకోవటం ఒక లెక్కా
ఒక జాతినీ ఒక నీతినీ
ఒక దేశాన్నే నిలబెట్టేవాళ్లం
మేము నిబడలేమా
అయ్యా మా కుర్చీలు లాగటానికి ముందు
ప్రజల సంక్షేమాన్ని మరిచి గురకపెట్టే
మీ కుర్చీల గురించి కాస్త ఆలోచించండి!
(టీచర్లకు కుర్చీలు తీసెయ్యాలన్న ఇటీవలి ఒక వార్త చూశాక)

- చిత్తలూరి - కవిత్వం
91338 32246