Sep 29,2023 21:39

ముంబయి : భారత విదేశీ మారక నిల్వలు వరుసగా మూడో వారంలోనూ పడిపోయాయి. శుక్రవారం ఆర్‌బిఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ నెల 22తో ముగిసిన వారంలో ఏకంగా 2.3 బిలియన్‌ డాలర్లు కరిగిపోయి 590.70 బిలియన్లకు పరిమితమయ్యాయి. ఇంతక్రితం రెండు వారాల్లో 5.9 బిలియన్ల నిల్వలు క్షీణించాయి. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు డాలర్లను ఆర్‌బిఐ విక్రయించడంతో నిల్వలు తగ్గుతున్నాయని ఫారెక్స్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021 అక్టోబర్‌లో భారత విదేశీ మారక నిల్వలు 645 బిలియన్‌ డాలర్లకు చేరి ఆల్‌టైం గరిష్ట స్థాయిని నమోదయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదల, భారత స్టాక్‌ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గడం, ఎఫ్‌ఐఐలు తరలిపోవడం, ఎగుమతులు క్షీణించడం, దిగుమతులు పెరగడం తదితర అంశాలు మారకం నిల్వలపై ఒత్తిడి పెంచుతున్నాయని బిఎన్‌పి పరిబాస్‌ బై షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అనుజ్‌ చౌదరి పేర్కొన్నారు.