ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రోడ్లపై సభలను, ర్యాలీలను ప్రభుత్వం నిషేధించింది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రాజ్ రోడ్లనపైన, వాటి మార్జిన్లలో ఇక నుండి ఎటువంటి సభలకు, ప్రదర్శనలకు అనుమతి చ్చేది లేదంటూ ఉత్తర్వులు (జిఒనెం1) జారీ చేసింది.
కందుకూరు, గుంటూరుల్లో చోటుచేసుకున్న విషాద సంఘటనలను సాకుగా చూపుతూ సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రజల హక్కులపై దాడి చేయడమేనన్న అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. వైసిపి మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు ప్రభుత్వ ఉత్తర్వులను తీవ్రంగా ఖండించాయి. ప్రజల భావప్రకటన స్వేఛ్చపై ప్రభుత్వం చేసిన దాడిగా పలువురు న్యాయవాదులు అభివర్ణించారు. బ్రిటిష్ కాలంనాటి (1861సం) పోలీస్ చట్టం ప్రకారం జారీ చేసిన ఈ ఉత్తర్వులతో మంగళవారం ఉదయం నుండే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలీస్ యాక్ట్‌లోని సెక్షన్ 30 అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఏ చిన్న కార్యక్రమానికైనా పోలీసు శాఖ అనుమతి తీసుకోవాలి. అయితే, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు వేగవంతంగా సరుకు రవాణాకు, ప్రయాణాలకు ఉద్దేశించినవని, మున్సిపల్, పంచాయతీరోడ్లు ఇరుకుగా, స్థానిక ప్రజల రవాణా అవసరాలు తీర్చడానికి ఉద్దేశించినవని, వీటిపై అనుమతి ఇవ్వకూడదని అధికారులను ఈ ఉత్తర్వులలో ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరహా కార్యక్రమాలకు ప్రత్యామ్నాయ స్థలాలు చూడాలని సూచించింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే షరతులతో అనుమతిచ్చే అధికారాన్ని జిల్లా ఎస్‌పిలకు, పోలీస్ కమిషనర్లకు కట్టబెట్టింది.
ఉపసంహరించుకోవాలి : సిపిఎం
రాష్ట్రంలో రోడ్‌షోలు, ర్యాలీలు నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే జిఓ తీసుకొచ్చిందని పేర్కొన్నారు. 'పోలీసులకు సర్వాధికారాలు కట్టబెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం. పోరాడి సాధించుకున్న పౌరహక్కులను ఏ పేరుతో అణచివేసినా సిపిఎం వ్యతిరేకిస్తుంది. కందుకూరు, గుంటూరు ఘటనలను ఆసరా చేసుకొని రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రోడ్లలో సభలు, ర్యాలీలు, రోడ్‌షోలు నిషేధించడం అప్రజాస్వామికం. రోడ్లపైన ర్యాలీలు, సభలు జరిపితే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనుకుంటే గుంటూరులో గ్రౌండ్‌లో సభ జరిపినప్పటికీ దుర్ఘటన జరగడం, పోలీసు వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజాస్వామ్య, పౌరహక్కులను కాలరాయడానికి ఇటువంటి జిఓ తీసుకురావడం సరైంది కాదు.' అని పేర్కొన్నారు. 'ఇప్పటికే కార్మికులు, రైతులు, ప్రజలు తమ కోర్కెలు, హక్కులకోసం ఆందోళనలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అణచివేస్తోంది ముందస్తు అరెస్టులు చేస్తోంది. సభలకు, ర్యాలీలకు అనుమతినివ్వడం లేదు. ఉన్న గ్రౌండ్లను ప్రభుత్వం ఆక్రమించుకొని పట్టణాలలో ఖాళీ స్థలమన్నది లేకుండా చేస్తోంది. ఊరికి దూరంగా ప్రజలతో సంబంధం లేకుండా సభలు జరుపుకోవాలనడం ఆమోదయోగ్యం కాదు. ప్రధాన పట్టణాల్లో సభలు జరుపుకోడానికి అవసరమైన మైదానాలను కేటాయించాలి. ప్రదర్శనలకు అనుమతినివ్వాలి.' అని డిమాండ్ చేశారు. 'జిఓ అమలు చేయడమంటే ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజాతంత్రవాదుల నోరు నొక్కే ప్రయత్నమే. నిరసన తెలియజేసే హక్కును కూడా ప్రభుత్వం నిషేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రోడ్‌షోలు, ర్యాలీలు నియంత్రించే జిఓను ఉపసంహరించు కోవాలి. ప్రజాతంత్రవాదులు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు, న్యాయకోవిదులు దీన్ని వ్యతిరేకిస్తూ ముందుకు రావాలి' అని వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించనున్నట్లు ఇది వరకే షెడ్యూల్ ఖరారైంది. ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు విధించడం గమనార్హం. ఈ మేరకు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శికి పలమనేరు డిఎస్‌పి నోటీసులిచ్చారు. సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. రోడ్లపై సభలు, ర్యాలీలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు.
వైసిపికి కూడా వర్తిస్తుంది : సజ్జల
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓ అన్ని రాజకీయ పార్టీలతో పాటు వైసిపి కూడా వర్తిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏ రాజకీయ పార్టీయైనా దీనిని అమలు చేయాల్సిందేనని చెప్పారు. కందుకూరు, గుంటూరు సభల్లో చోటుచేసుకున్న దుర్ఘటనలను దృష్టిలో వుంచుకొని ప్రజల భద్రత కోసం ఈ జిఓ జారీ చేసినట్లు తెలిపారు.










