మనిషికి కొద్దిగా నలతగా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు తెచ్చుకుంటాడు. తాను పెంచుకునే జంతువులకూ పశువైద్యశాలకు తీసుకెళ్లి వైద్యం అందిస్తాడు. మరి అడవిలో ఉన్న జంతువుల పరిస్థితి ఏంటి?... అటువంటి మృగాలకు, విష పూరిత జీవులను ప్రమాదాల నుంచి రక్షించడం, దగ్గరకు వెళ్లి వైద్యం చేయడం ఓ పెద్ద సవాల్. అయినా మేఘన చాకచక్యంగా వన్య ప్రాణులను అపాయాల నుంచి కాపాడుతున్నారు. వెంటనే వైద్యం అందిస్తున్నారు. అవసరమైతే శస్త్రచికిత్స చేసి వాటి ప్రాణాలను కాపాడుతున్నారు.
అడవి జంతువులు మంచినీళ్ల కోసం, ఆహారం కోసం అడవిలో సంచరిస్తూ ఉంటాయి. ఒక్కోసారి రోడ్డు దాటి మరో ప్రదేశానికి తరలి వెళుతూ ఉంటాయి. ఈ క్రమంలో అవి ప్రమాదానికి గురవుతున్నాయి. లోతైన బావుల్లో పడటం, బురదలో కూరుకుపోవడం, గాయాలవడం జరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్నాటకకు చెందిన డాక్టర్ మేఘనా పెమ్మయ్య వాటిని రక్షించి, వైద్యం చేస్తున్నారు. తిరిగి సురక్షితంగా అడవికి పంపిస్తున్నారు. సాధారణంగా పులుల గాండ్రింపు వింటేనే భయపడి పారిపోతారు. అలాంటిది ఆమె చిరుత పులులను పట్టుకుని వైద్యం అందించిన సందర్భాలు ఎన్నో. 32 ఏళ్ల మేఘనకు చిన్నప్పటి నుంచి జంతువులంటే ఇష్టం. ఆ ఆసక్తితో బెంగళూరులోని హెబ్బల్‌లోని వెటర్నరీ కళాశాల్లో సైన్సెస్ అండ్ వైల్డ్‌లైఫ్ మెడిసిన్ చదివారు. అందుకు తన కుటుంబం చాలా మద్దతు ఇచ్చింది. ఆమె తండ్రి, పోలీసు సూపరింటెండెంట్. ఆయన ప్రోత్సాహంతో మేఘన వన్యప్రాణుల రక్షించే డాక్టర్‌గా వృత్తి చేపట్టారు.
రెస్క్యూ ఆపరేషన్లతో...
మేఘన ఏడేళ్ల క్రితం ఈ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఎప్పుడైనా, ఎక్కడైనా చిరుత పులులు బావుల్లో పడ్డాయని, మంటల్లో చిక్కుకున్నాయని, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాయని సమాచారం అందిన వెంటనే వెళతారు. ఎటువంటి పనినైనా పక్కనబెట్టి బృందంతో కలిసి పరుగుతీస్తారు. వందల సార్లు లోతైన బావిలో చిరుత పులులు పడ్డాయని సమాచారాలు వచ్చాయి. లోతు గురించి ఆలోచించకుండా బావుల్లోకి దిగి వాటిని రక్షిస్తుంది. ఒకసారి 20 అడుగుల బావిలో పడిన పులిని బయటకు తీసేందుకు సభ్యులు వెనకాడారు. మేఘనా ధైర్యంగా బావిలోకి దిగింది. పులిని ఎలాగైనా రక్షించాలన్న ఆలోచనతో బోను సహాయంతో బావిలోకి దిగింది. దానికి మత్తు ఎక్కిన తర్వాత పులిని పట్టుకుని బోనులోకి లాగింది. ఆ క్రమంలో గాయపడిన పులులు ఒక్కోసారి వీరిని చూసి బెదిరిపోయీ తిరిగి దాడి చేసే అవకాశమూ లేకపోలేదు. అయినా మేఘనా రెస్క్యూ సూట్ వేసుకుని ఆ జంతువుల దగ్గరకు వెళ్లి వాటిని కాపాడుతుంది. వాటిని వైద్యశాలకు తరలించి భద్రత కల్పిస్తుంది.
ఒకసారి కర్కాల సమీపంలోని ఒక గ్రామంలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన వలలో చిరుతపులి చిక్కుకుంది. ఆ వల పులిని కదలనివ్వకుండా ఛాతికి బిగుతుగా పట్టేసింది. దాంతో మెడపై చర్మం చీలి తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దాన్నీ కాపాడి శస్త్రచికిత్స చేసింది మేఘన. గత ఏడాది ఎనిమిది చిరుతపులిలను బావిలో నుంచి రక్షించింది.
కర్ణాటకకు ఇరుగుపొరుగున ఉన్న సుబ్రహ్మణ్య, కుద్రేముఖ్ అడవుల్లో ఉన్న పక్షులు, ముంగిసలు, నక్కలకు చికిత్స చేశారు. అలాగే వానలకు, వరదలకు బయటకు వచ్చిన పాములు బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు, గాయపడిన పాములను, జాక్‌ల పక్షులను, మనిషి చర్యల వల్ల దెబ్బతిన్న ఏనుగులను కాపాడి చికిత్స చేసింది. ఇంతటి ప్రమాదకరమైన వృత్తిలో రాణిస్తున్న మేఘనను అధికారులు, తోటి వైద్య సిబ్బంది. అభినందిస్తున్నారు. ఒక్కోసారి ఆ వన్యప్రాణులకు ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు తన భర్త సహాయమూ తీసుకుటుంది. ఆయనా పశు వైద్యడే. ఆయన కూడా మేఘనాను ఈ ఫీల్డ్‌లో వెన్నుతట్టి ప్రోత్సహించారు. అడవుల్లో వేగంగా పట్టణీకరణ జరగడం వల్లే జంతువులు బయటకు వస్తున్నాయి. దేశంలో సుమారు 7,400 చదరపు కిలోమీటర్లు అడవులను మనుషులు ఆక్రమించుకున్నారు. అది అర్థం చేసుకోకుండా జనం వాటిని హింసిస్తున్నారు. దీన్ని మానవ-జంతు సంఘర్షణగా ప్రత్యక్ష అనుభవాన్ని చూస్తున్నారు. వీటిపై మనుషులకు అవగాహన కల్పించటమే తన లక్ష్యమంటున్నారు మేఘన.










