Oct 28,2023 08:38

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : మెడికల్‌ ఎకో సిస్టమ్‌ను తీసుకురావడం ఎంతైనా అవసరమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆంధ్రా మెడికల్‌ కాలేజీ శతాబ్ది ఉత్సవాలను వర్చ్యువల్‌గా ఆయన శుక్రవారం ప్రారంభించారు. తొలుత కింగ్‌జార్జ్‌ ఆస్పపత్రిలో రూ.23.75 కోట్లతో ఏర్పాటు చేయనున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో వర్చ్యువల్‌గా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. దేశంలోనే పురాతన వైద్య కళాశాల విశాఖలో ఉండటం ఆ ప్రాంతానికి గర్వకారణమని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలను తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, మారుమూల గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. వైద్య సేవలకు వేల కోట్ల రూపాయలను తమ ప్రభుత్వం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కెజిహెచ్‌ అభివృద్ధికి రూ.600 కోట్లు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల కోసం రూ.246 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ బాబ్జీ, మధ్యప్రదేశ్‌ ఆయుష్మాన్‌ భారత్‌ ముఖ్య కార్యదర్శి రమేశ్‌ కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ జె.నివాస్‌, ఎఎంసి సెంటినరీ సెలబ్రేషన్స్‌ కమిటీ అధ్యక్షులు డాక్టర్‌ టి.రవిరాజు పాల్గొన్నారు. ఆదివారం ఉపరాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్‌ పాల్గొననున్నారు.