Aug 02,2023 21:03

ముంబయి: భారత క్రికెట్‌ బోర్డు ఆదాయం సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది. స్పాన్సర్‌షిప్‌ హక్కుల టెండర్లకు ఆహ్వానాలు పలికి ఒక్క రోజు గడువక ముందే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు మీడియా హక్కులు కట్టబెట్టేందుకు సిద్ధపడింది. వన్డే వర్డల్‌ కప్‌(వన్డే ప్రపంచకప్‌-2023) సమీపిస్తున్నందున మీడియా హక్కుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. అంతేకాదు 'ఇన్విటేషన్‌ టు టెండర్‌'లో వివరాలతో పాటు షరతులు స్పష్టంగా పేర్కొంది. ఆసక్తిగల మీడియా సంస్థలు జీఎస్టీతో కలిపి రూ.15 లక్షల నాన్‌ రీఫండబుల్‌ ఫీజు చెల్లించాలని తెలిపింది. అర్హతలు, అవసరాలు, బిడ్స్‌ వేయడం, హక్కులు, అభ్యంతరాలు.. ఇవన్నీ టెండర్‌ ప్రక్రియలో భాగమని బిసిసిఐ వెల్లడించింది. ఇన్విటేషన్‌ టు టెండర్‌(ఐటిటి) పద్ధతిపై ఈనెల 25 వరకు అందుబాటులో ఉంటుంది. 'ఆసక్తిగల కంపెనీలు తప్పనిసరిగా ఐటీటీ కొనుగోలు చేయాలి. అయితే.. అన్ని విధాలా అర్హులైన వాళ్లకు మాత్రమే బిడ్‌ వేసేందుకు ఎంపిక చేస్తాం. అందుకని ఐటిటి కొన్నంత మాత్రాన బిడ్‌ వేసేందుకు ఢోకా లేదని అనుకోవద్దు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..? ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా బిడ్డింగ్‌ ప్రక్రియను రద్దు చేసేందుకు సర్వ అధికారాలు బిసిసిఐకి ఉన్నాయి' స్పష్టంగా తెలిపింది. మీడియా హక్కులు దక్కించుకొన్న సంస్థలు 2027 వరకు కొనసాగుతాయని, ఆ సర్కిల్‌లో మొత్తం 102మ్యాచ్‌లు జరగనున్నట్లు బిసిసిఐ ఆ ప్రకటనలో పేర్కొంది.