Oct 13,2023 09:42
  • హైదరాబాద్‌, మహారాష్ట్ర, బెంగాల్‌ జట్ల గెలుపు

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌ : ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఎసిఎ) ఆధ్వర్యంలో మంగళగిరి, మూలపాడు మైదానాల్లో 'వినూ మాన్కడ్‌' ట్రోఫీ కోసం బీసీసీఐ బాలుర అండర్‌-19 అంతర్‌ రాష్ట్ర టోర్నమెంట్‌ మ్యాచ్‌లు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. మంగళ గిరి అంతర్జాతీయ స్టేడియంలో ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌ రెడ్డి మ్యాచ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌లో ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్‌, మేఘాలయ, హైదరాబాద్‌, ఉత్తరాఖండ్‌ జట్లు పాల్గొంటున్నాయి.
         మంగళగిరిలోని ఎసిఎ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు ఉత్తరాఖండ్‌ జట్లు తలపడ్డాయి. మొదటగా టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ జట్టు బ్యాటింగ్‌ ఎన్నుకొని బరిలోకి దిగి 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 345 పరుగులు చేసి 77 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌ జట్టు బ్యాట్స్‌ మ్యాన్లు ఎ.అవినాష్‌ 70 బంతుల్లో 8 సిక్సులు, 14 ఫోర్లుతో 128 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేశాడు. అలాగే ఆరోన్‌ జార్జ్‌ 77 బంతుల్లో 60 పరుగులు చెయ్యగా, ఎం.ఎస్‌ కార్తికేయ 34 బంతుల్లో 55 పరుగులు చేసి ఇద్దరు అర్ధ సెంచరీలు సాధించారు. ఉత్తరాఖండ్‌ బౌలర్‌ అషర్‌ ఖాన్‌ 10 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి 4 వికెట్లను కైవసం చేసుకున్నాడు. బ్యాటింగ్‌ బరిలోకి దిగిన ఉత్తరాఖండ్‌ జట్టు 47.4 ఒవర్లలో 268 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది.
        మూలపాడు సమీపంలో ఉన్న డివిఆర్‌ గ్రౌండ్‌ వేదికగా మహారాష్ట్ర, ఢిల్లీ జట్లు తల పడ్డాయి. మొదటగా టాస్‌ గెలిచిన మహారాష్ట్ర జట్టు బ్యాటింగ్‌ ఎన్నుకొని 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 316 పరుగులు చేసి 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. మహారాష్ట్ర జట్టు బ్యాట్స్‌ మ్యాన్లు కిరణ్‌ చోర్మెల్‌ 97 బంతుల్లో 4 సిక్సులు, 8 ఫోర్లుతో 105 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేశాడు. అలాగే దిగ్విజరు పాటిల్‌ 44 బంతుల్లో 49 పరుగులు చెయ్యగా, కె.అనురాగ్‌ 49 బంతుల్లో 43 పరుగులు చేసి ఇద్దరు అర్థ సెంచరీలకు చేరువలో మిగిలి పోయారు. ఢిల్లీ జట్టు బౌలర్‌ దివన్ష్‌ రావత్‌ 10 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చి 2 వికెట్లను కైవసం చేసుకున్నాడు. బ్యాటింగ్‌ బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 49 ఒవర్లలో 236 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది.
         మూలపాడులోని సిపి గ్రౌండ్‌లో బెంగాల్‌, మేఘాలయ జట్లు తలపడ్డాయి. మొదటగా టాస్‌ గెలిచిన బెంగాల్‌ జట్టు బ్యాటింగ్‌ ఎన్నుకొని బరిలోకి దిగింది. 50 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 402 అధిక పరుగులు చేసి 346 పరుగుల తేడాతో ఘన విజయన్ని సాధించింది. బెంగాల్‌ జట్టు బ్యాట్స్‌ మ్యాన్లు చంద్రస్‌ దాష్‌ 74 బంతుల్లో 5 సిక్సులు, 12 ఫోర్లు తో 126 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేశాడు. అలాగే సయాన్‌ దేవ్‌ 106 బంతుల్లో 110 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేశాడు. సల్మాన్‌ అహ్మద్‌ 93 బంతుల్లో 73 పరుగులు చేసి అర్థ సెంచరీ పూర్తి చేశాడు.బెంగాల్‌ జట్టు బౌలర్‌ సౌరభ్‌ సింగ్‌ 6 ఓవర్లలో 0 పరుగులు ఇచ్చి 4 వికెట్లను కైవసం చేసుకొని మేఘాలయ జట్టు గెలుపుకి అడ్డుకట్ట వేశాడు. బ్యాటింగ్‌ బరిలోకి దిగిన మేఘాలయ జట్టు 35.2 ఓవర్లలో 56 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యి ఓటమి పాలైంది.