Oct 15,2023 08:24

రోజు రోజుకూ మానవతా విలువలు, బంధాలు, బంధుత్వాలు కనుమరుగవుతున్న వేళ ఆపన్నులకు 'నేనున్నా..' అంటూ ఆయన దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అనుకోని దురదృష్టకరమైన సంఘటనలో తన కుమార్తె మృత్యువాత పడటంతో దాని నుంచి ఆయన తేరుకోలేకపోయారు. ఆ తర్వాత కుమార్తె శ్రీదేవి జ్ఞాపకార్థంగా మెమోరియల్‌ చారిటబుల్‌ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి అప్పటి నుంచి తనకున్న దాంట్లో అడిగిన వారికి లేదనకుండా సాయం చేయటంలో ముందుటున్నారు. ఆయన ఏ ప్రాంతానికి చెందిన వారు? ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారో తెలుసుకుందాం.

           పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామంలో రైతు కుటుంబంలో దాట్ల రామకృష్ణంరాజు- వరలక్ష్మి దంపతులకు రెండో సంతానంగా 1971లో దాట్ల వెంకటరామరాజు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కుటుంబ జీవనాన్ని గడిపేవారు. వెంకట రామరాజు కూడా వ్యవసాయంలో సహకారం అందించే వారు. చిన్ననాటి నుంచే తనకు వ్యవసాయం, సమాజం పట్ల ఆసక్తి మెండుగా ఉండేది. ఆయన పదో తరగతి వరకు చదువుకున్నారు. ప్రకృతివైపరీత్యాలతో చేస్తున్న వ్యవసాయం, ఆక్వా సాగులో నష్టాలు రావటంతో పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయారు. అనంతరం స్వగ్రామం కాళ్ళకూరు గ్రామం నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు కంపెనీలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. సుమారు 20 సంవత్సరాలు అక్కడ పని చేశారు. అనంతరం ఆ తర్వాత విష్ణు ప్రియా సొల్యూషన్‌ ట్రేడింగ్‌ కంపెనీ ఏర్పాటుచేసి వ్యాపార రీత్యా హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో స్థిరపడ్డారు. హైదరాబాద్‌, విశాఖపట్టణం, బెంగుళూరు పట్టణాల్లో బ్రాంచిలు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో తనవంతుగా చేసిన కృషి, సిబ్బంది అంకితభావంతో ఉన్నత స్థితికి ఎదిగారు. వెంకటరామరాజుకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. చిన్నకుమార్తె దాట్ల శ్రీదేవి ఆకస్మికంగా మృతి చెందారు.
 

                                                         తల్లి అంత్యక్రియలకు జాగా లేక ఇబ్బందులు

వెంకటరామరాజు తల్లి వరలక్ష్మి అనారోగ్యంతో 2019లో మృతి చెందారు. అంత్యక్రియల కోసం గ్రామంలోని మోక్షధామం (శ్మశానవాటిక)కు చేరుకున్నారు. అదే రోజు జోరు వర్షంతో మోక్షధామం లోతట్టుగా ఉండడంతో వర్షపు నీటితో మునిగిపోయింది. దహనం చేయడానికి అనేక అవస్థలు పడాల్సి వచ్చింది. గ్రామంలో ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నా మోక్షధామం పరిస్థితికి ఎవ్వరూ స్పందించకపోవటం చూసి రామరాజు మనసును బాధించింది. ఆ క్షణంలోనే దానిని అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చింది.

11

                                                              దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌తో సేవలు

రెండో కుమార్తె దాట్ల శ్రీదేవి 2021 ఫిబ్రవరిలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుండగా అపార్ట్మెంట్‌పై దుస్తులు తీగపై వేస్తుండగా కాలు జారిపోయి కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఏప్రిల్‌లో ట్రస్ట్‌ ఏర్పాటుచేయగా మే నెల నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. వ్యాపార రీత్యా ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నా అప్పటి నుంచి ప్రతి నెలా పుట్టిన గ్రామంలో ట్రస్ట్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం, వృద్ధులు, అనాధలు, అభాగ్యుల కోసం దుస్తులు, సామాగ్రి పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామంలో వివిధ అభివద్ధి పనుల నిమిత్తం సుమారు రూ.70 లక్షలు వరకూ ఆర్థిక సహాయంగా అందజేశారు. పేద కుటుంబంలో ఎవరింట్లో వివాహం జరిగినా రూ.5000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. వికలాంగులకు వీల్‌ చైర్లు వంటివి అందజేస్తున్నారు.
 

                                                             రేవులు, శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు

శ్మశాన వాటిక అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను ట్రస్ట్‌ ద్వారా కల్పించారు. నాలుగు దహన గదుల షెడ్లు, రెండు రేవులు, మూడు వైపులా ఇనుప వైరుతో ఫెన్సింగ్‌, ఆహ్లాదాన్ని ఇచ్చేలా మొక్కలను కూడా నాటారు. వాటన్నింటినీ ఏర్పాటు చేసేందుకు ట్రస్టు ద్వారా సుమారు రూ 30 లక్షలు వ్యయం చేశారు. క్రిస్టియన్‌ పేటకు వెళ్లే ప్రధాన రహదారిలో కల్వర్టు. వంతెన అభివృద్ధి పనులు రూ 4లక్షలుతో చేపట్టారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు, పేద ప్రజల దహన సంస్కారాలకు, వివాహానికి, కంటి ఆపరేషన్లకు ఆర్థికసాయాన్ని అందిస్తూనే ఉన్నారు. గ్రామంలో రోడ్ల వెంబడి 150 సిమెంట్‌ బల్లలను కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. సంక్రాంతి, క్రిస్మస్‌, రంజాన్‌, వివిధ పండుగల సమయంలో అన్ని తరగతుల ప్రజల కోసం అన్నదానం ఏర్పాటుచేయిస్తున్నారు. ఏటేటా మే,జూన్‌ నెలల్లో వేసవిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.
 

                                                                      సేవలకు డాక్టరేట్‌తో గుర్తింపు

గ్రామంలోని వెంకటేశ్వర పద్మావతి మంచినీటి చెరువు అభివృద్ధికి నోచుకోలేదు. రేవులు కూడా శిథిలావస్థకు చేరాయి. 25 ఏళ్ల తర్వాత సుమారు రూ.13 లక్షలతో చెరువులో పూడికలు తీయించారు. మూడు రేవులు, రిటైనింగ్‌ వాల్‌ నిర్మించిన నిర్మాణ పనులను డిసిసిబి అధ్యక్షులు పి.వి.ఎల్‌. నరసింహరాజు ప్రారంభించారు. అనంతరం ట్రస్ట్‌ ఛైర్మన్‌ దాట్ల వెంకటరామరాజును ఆయన సత్కరించారు. బెంగుళూరుకు చెందిన ఆసియా వేదిక్‌ కల్చర్‌ రీసెర్చ్‌ యూనివర్శిటీ 2023 ఏప్రిల్‌లో గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.
                                                                                           - గొట్టేటి శ్రీనివాసులు
                                                           9397139966, ప్రజాశక్తి కాళ్ళ విలేకరి, పశ్చిమ గోదావరి జిల్లా.

22

                                                                భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు

సమాజంలో నేటికీ ఇంకా పేదరికం కొనసాగుతూనే ఉంది. ఎవరో ఏదో ఇస్తారని..చేస్తారని అనుకోకుండా నా వంతు బాధ్యతగా నాకున్న దానిలో ఎంతో సేవచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. సంపాదనలో కొంతమేరకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఎంతో మానసిక సంతృప్తినిస్తుంది. నేటి తరంలో తండ్రీకుమార్తెల మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోతుండటం బాధేస్తుంది. నా కుమార్తె శ్రీదేవి చనిపోవటం చాలా బాధేసింది. ఆమె జ్ఞాపకార్థంగా ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాను. ఇప్పటివరకు రూ.70 లక్షలతో గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాను. వివిధ పండుగలకు అన్న దానం చేయడం, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, కంటి వైద్యం కోసం ఆర్థిక సాయం చేస్తున్నాను. ప్రతి సంక్రాంతి పండుగ సందర్భంగా 50 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ వస్తున్నాను.
                                                                                                       - దాట్ల వెంకటరామరాజు
                                                                                    శ్రీదేవి మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత, కాళ్లకూరు