Aug 04,2023 10:14

మానవ అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో ప్రకృతికి, పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలుగుతోంది. గాలి, నీరు, ధ్వని కాలుష్యాలతో మానవాళిని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు 'నేనున్నా'నంటూ తన వంతు కృషి చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు గాదిరాజు రంగరాజు.

112


         పాలకోడేరు మండలం గొల్లల కోడేరులో సామాన్య రైతు కుటుంబంలో గాదిరాజు శ్రీరామరాజు, సీతమ్మ దంపతులకు 1960లో జన్మించారు రంగరాజు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కుటుంబ జీవనాన్ని గడిపేవారు. రంగరాజు కూడా వ్యవసాయంలో సహకారం అందించేవారు. చిన్ననాటి నుంచే తనకు వ్యవసాయం పట్ల, ప్రకృతి పట్ల అమితమైన ప్రేమ. ఆరేడు తరగతులు చదువుతున్న సమయంలో అప్పటి పిఇటి గాదిరాజు సూర్యనారాయణ రాజు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేవారు. దాంతో, తనకు ఇంట అలవడ్డ మొక్కల ప్రేమ మరింత పెరిగింది. తోటి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇదే స్ఫూర్తితో తమ ఇంటి పరిసరాల్లోనూ మొక్కలు పెంచటాన్ని ఆరంభించారు. ఎంఎ, ఎంఇడి చేసిన ఆయన 1989లో సోషల్‌ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. చెరుకువాడలో ఉంటూ 2020లో ఉద్యోగ విరమణ పొందారు. తను పనిచేసిన అన్నిచోట్లా పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషిచేశారు. పిల్లలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
 

                                                    ఔషధ మొక్కల పెంపకమే లక్ష్యంగా ...

రంగరాజు ఇప్పుడు అరుదైన ఔషధ మొక్కలను సేకరిస్తూ వాటి పరిరక్షణకు కృషిచేస్తున్నారు. ఎన్నో అరుదైన మొక్లను, చెట్లను నాటి, పెంచి, తన ఇంటి చుట్టూ ఒక చిట్టడవిలా తీర్చిదిద్దారు. ఐదేళ్లక్రితం ఉద్యోగ విరమణ చేసిన దేశంలోని చాలా ప్రదేశాలను సందర్శించి, అక్కడ లభించే మొక్కలను కొనుగోలు చేసి తన ఇంటి పరిసర ప్రాంతాల్లో నాటారు. ఇప్పుడు ఆ ఇల్లు అరుదైన, ఔషధ గుణాలు ఉన్న వివిధ మొక్కల మధ్య హరితవనంలా కళ కళలాడుతోంది. తులసి, మెంతి, నిమ్మ, బాసిల్‌, కలబంద, పుదీనా, గోతు కోలా (బ్రహ్మి,), అశ్వగంధ, జామ, నిమ్మ, అరటి, పుచ్చ, చిలగడదుంప, నల్లద్రాక్ష, వేరుశనగలు, కాఫీ, టీ, మల్బరీస్‌, స్ట్రాబెర్రీ, ఉసిరి, బత్తాయి, కమలా, క్యాప్సికం వంటి మొక్కలను వారి ఇంటి వద్ద మనం దర్శించవొచ్చు. ఏ రోగమైనా మొట్టమొదట మన శరీరంలోని రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పై దాడి చేసి, గెలిచి మన శరీరాన్ని ఆక్రమిస్తుంది. కనుక మనలో రోగ నిరోధక శక్తి నిండుగా ఉండడం ముఖ్యం. సి విటమిన్‌ ఉన్న జామ, బత్తాయి, కమలా, నిమ్మకాయ, క్యాప్సికమ్‌ వంటివి తినాలి. వెల్లుల్లి, అల్లం, పసుపు, మిరియాలు, ఆకుకూరలు, ముఖ్యంగా మునగాకు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే ఇలాంటి చెట్లను, మొక్కలను తాను పెంచుతున్నానని గాదిరాజు రంగరావు చెబుతున్నారు.
 

                                                        మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా...

గాదిరాజు రంగరాజు బహుముఖ ప్రజ్ఞాశాలి.ఉపాధ్యాయుడిగా పాఠాలు బోధిస్తూనే రచనలు చేశారు. నాటకాల్లో పాత్రలు ధరించారు. కవిగా, రచయితగా, కళాకారుడగా, సామాజిక వేత్తగా తన జీవితాన్ని ఆయన తీర్చిదిద్దుకున్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలో ఆయా గ్రామాల్లో మూఢ నమ్మకాలైన చేతబడులు, ఇతర క్షుద్ర పూజలకు వ్యతిరేకంగా తన వంతు కృషి చేశారు. చినకాపవరం గ్రామంలో విద్యార్థులు 'దెయ్యం' పేరుతో భయపడుతున్నప్పుడు తానే స్వయంగా ఆ పాఠశాలకు వెళ్లి, విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి పర్యావరణం, మూఢ నమ్మకాలు, కౌమార బాలికల సమస్యలపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు.
 

                                                               అనేక అవార్డులు...రివార్డులు

ఎంఎ తెలుగు, ఎంఎ జాగ్రపీ, ఎంఎ పాలిటిక్స్‌, ఎంఎ పబ్లిక్‌ అడ్మిస్ట్రేషన్‌, ఎంఇడి పూర్తిచేశారు. పిహెచ్‌డి కోసం 'పశ్చిమ గోదావరి జిల్లా నాటక రంగ వికాసం' తొలి నాటక పరిశోధన గ్రంథాన్ని కర్ణాటక సార్వత్రిక విశ్వ విద్యాలయం (మైసూర్‌)కు థీసెస్‌గా సమర్పించారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు, జనాభా లెక్కల సేకరణలో జాతీయ స్థాయి సిల్వర్‌ మెడల్‌, జన్మ భూమి పోటీల్లో గోల్డ్‌, సిల్వర్‌ మెడల్స్‌, కార్టూన్‌ కళలో అంతర్జాతీయ ప్రశంసలు, కవిత్వం, కార్టూన్లు, కథలకు అనేక పురస్కారాలు, బహుమతులు పొందారు. పురాతన నాణేలు సేకరించటం, బొమ్మలు గీయటంలో కూడా ఆయన దిట్ట. ప్రభుత్వం తరపున ఉగాది పురస్కారాలను అందుకున్నారు. 2017లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అప్పటి సిఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నారు. లయన్స్‌ క్లబ్‌ ఉండి అధ్యక్షుడిగా ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకుడిగా కొనసాగుతున్నారు. పలు సీనియళ్లలో కూడా నాటించారు. రాజ్‌తరుణ్‌ హీరోగా నటించిన 'అనుభవించు రాజా' సినిమాలో గుమస్తాగా నటించారు.
                  - గొట్టేటి శ్రీనివాసులు, 93971 39966

2233


                                                           భావితరాలకు ఔషధ మొక్కలు

దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి, అనేక రకాలైన ఔషధ మొక్కలను సేకరించి తెచ్చాను. మా ఇంటి పరిసరాల్లో వందలాది మొక్కలూ నాటాను. ప్రతిరోజూ కొంతమంది వచ్చి కూరగాయలు, పండ్లు, ఔషధాలను తీసుకెళ్తుంటారు. అనేక రకాలైన మామిడి, పండ్లు, పుష్పాల మొక్కలు ఉచితంగానే అందజేస్తున్నాం. శీతల ప్రదేశాల్లో ఉండే కాపీ మొక్కలను సైతం పెంచుతున్నాను. ప్రస్తుతం 57 రకాల ఔషధ మొక్కలు అందుబాట్లో ఉన్నాయి. ఔషధ గుణాల మొక్కల వల్ల స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. కనుమరుగవుతున్న మొక్కలను భావితరాలకు అందించటమే నా లక్ష్యం.
- గాదిరాజు రంగరాజు