Jan 02,2023 08:43

నాలుగు దశాబ్దాలుగా తెలుగు కథా సాహిత్యంలో అలుపెరుగని కృషి చేస్తున్న సాహితీ సవ్యసాచి గంటేడ గౌరునాయుడు మాస్టారు. ఆయన రాసిన పదకొండు కథల సంపుటే 'మాయ'. ఆయన ఈ కథలన్నీ 2008- 22 మధ్య కాలంలో రాసినవి. ఈ పద్నాలుగేళ్లలో తాను చూసిన, మోసిన అనేక సంఘటనల ప్రేరణకు ప్రతిబింబాలుగా ఈ కథలు మనకి కనిపిస్తాయి.
తొంభయ్యో దశకంలో ప్రవేశించిన ప్రపంచీకరణ వల్ల అనేక సంక్షోభాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రైతు బతుకు చిన్నాభిన్నం అయ్యింది. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు వలసబాట పట్టడం, సాగురంగంలో పెనుమార్పులు రావడం, వాణిజ్య పంటల హవా పెరగడం, వ్యవసాయంలో యంత్రాంగం ప్రవేశించడం, పురుగులు మందులు, ఎరువులకు పెట్టుబడి పెరిగిపోవడం, తీరా పండిన పంటని మార్కెట్‌కి తీసుకువెళ్తే తగు ధర లేకపోవడం ... ఈ రచయిత స్వయంగా చూశారు. ఈ పరిణామాల కారణంగా రైతన్నలు వ్యవసాయ కులీలుగాను, కర్మాగారాల్లో కార్మికులాగానో మారుతున్నారు. ఇలాంటి అనేక సంఘటనలకి 'మాయ' కథల సంపుటి సాక్ష్యంగా నిలుస్తుంది. ఆశ్రమ పాఠశాలల్లో జరిగే అమానవీయమైన సంఘటనలను కూడాఈ కథల్లో గమనించవచ్చు.
'మాయ', 'పొద్దు ములిగిపోయింది', 'అనగనగా ఒక ఊరు', 'అల్పపీడనం' మొదలైన కథలన్నీ నిర్వాసితుల వ్యథార్థ గాథలను వినిపిస్తాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా ఊరిని, పొలాల్ని కోల్పోయిన గ్రామప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన కొత్త గ్రామాల్లో ఎదురైన చేదు అనుభవమే ఈ 'మాయ' కథ. నాగావళి నదిపై తోటపల్లి బ్యారేజి నిర్మాణం కోసం చుట్టుపక్కల గ్రామాలను ఖాళీ చేపించింది ప్రభుత్వం. నిర్మాణంలో భాగంగానే ఊరిని, పొలాల్ని కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి, ఇళ్ళ స్థలాలను చూపించింది. ఇళ్ళను, పొలాల్ని కోల్పోయిన ప్రజలు పట్టణాలకు వచ్చి వ్యసనాలు బారిన పడ్డారు. కథ అంతటికీ మూలం చిరంజీవులు నాయుడు చావు. అక్కడి నుంచి మొదలైంది. కథకులు తన కళ్లారా చూసిన సంఘటనని కథగా మలచి హృదయవిదారకంగా చిత్రించి, కథను నడిపించిన తీరు పాఠకుల్ని కంటతడి పెట్టిస్తుంది. చిరంజీవులు నాయుడు శవాన్ని దహన కార్యక్రమాలు చేపించడానికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ ఊర్లో శ్మశానం లేదు. ముంపు భూములకి తగుధర కోసం ధర్నా చేసిన వాళ్ళు నేడు 'మా వూరికి రోడ్డు కావాలనో.. బస్సు కావాలనో.. ఆసుపత్రి కావాలనో అడుగుతారు. ఎవరైనా... కానీ మాకో వల్లకాడు కావాల అని అడుగుతున్నవాళ్ళం చరిత్రలో మనమే మొదటోళ్ళం గావాల' అన్న మాటల్లో నిర్వాసితులుగా మారిన పల్లె ప్రజల రోదన, వేదన కనిపిస్తుంది. ఎవరో ప్రయోజనాల కోసం మరొకరి జీవితాలు బలైపోతున్న వాస్తవ సంఘటనలు ఈ కథలో కనిపిస్తాయి. ఈ నేపథ్య క్రమంలోనే ప్రాజెక్ట్‌ నిర్మాణ నిమిత్తం ముంపుకు గురైన గ్రామ ప్రజలు నిరాశ్రయులగా మారిన దృశ్యానికి నిదర్శనంగా 'పొద్దు ములిగిపోయింది' కథ కనిపిస్తుంది.
పాత్రికేయుడికి ఒక రోజులో ఎదురైన సంఘటనల్ని రికార్డు చేసిన కథే 'మూడు దృశ్యాలు'. ఈ కథలో ప్రధానంగా మూడు సన్నివేశాలు కనిపిస్తాయి. ప్రతి సన్నివేశం కూడా ఒకే అంశంతో ముడిపడి ఉండడం ప్రత్యేకత. వ్యసనాలకు, వినోదాలకు బానిసలైన ప్రజలు ఒక దగ్గర సంపాదించిన భూముల్ని వేరొకరికి అమ్మేయడం ఫలితంగా వలసబాట పట్టడం మొదటిది. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన పావలా వడ్డీ రుణాల్ని తీసుకొని అధిక వడ్డీకోసం మధ్యవర్తిగా వేరొక చిట్‌ఫండ్‌ కంపెనీకి ఇచ్చి బలైపోయిన మహిళా కుటుంబం రెండోది. పాఠశాలకి అనుబంధంగా నడిపే వసతి గృహాల్లో పిల్లలకి ఇచ్చే గుడ్లను కొందరు తినకుండా పెద్ద తరగతి విద్యార్థికి యాభై పైసలకు అమ్మగా ఆ గుడ్లు కొన్న విద్యార్థి అవే గుడ్లు బజ్జీ బండివాడికి రూపాయికి అమ్ముతాడట. ఆ బజ్జీలు బండి వాడు అదే గుడ్డును మూడు రూపాయలకి అమ్ముతున్నాడు. ఇలా ఒక దగ్గర సంపాదించిన దానిని మరొక దగ్గర పోగొట్టుకోవడం అనే విషయం మూడు సన్నివేశాల్లోనూ కనిపిస్తుంది.
గిరిజనాభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలు, కార్యాలయాలు నెలకొల్పింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ, ప్రాథమిక దశ నుంచే అవి దారి మళ్ళింపబడుతున్నప్పుడు అభివృద్ధికి తావులేదు. అలాంటి నేపథ్యంలోనే వెలువడిన కథ 'ఇండియాగాడి టీ.సి.'. ఈ కథలో ఒకరి అవకాశాలను మరొకరు ఎలా ఆపాదించుకుపోతున్నారో తెలియజేస్తారు. ఎవరి అవకాశాలు వాళ్ళు ఉపయోగించుకుంటూ పొతే వ్యక్తి అభివృద్ధి మీదనే సమాజాభివృద్ధి ఆధారపడి ఉంటుందనే విషయాన్ని రచయిత స్పష్టంగా తెలియజేశారు. ఇలాంటి ఇతివృత్తమే 'సంధ్య' కథలో కూడా చోటుచేసుకుంది. అనాథగా ఉన్న అమ్మాయిని ఒక ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకొని దీర్ఘకాలంగా మానేసిన అమ్మాయి పేరుతో చదువుకోవడానికి సహాయపడతాడు. ఆ అమ్మాయి బాగా చదువుకొని వార్డెన్‌ ఆదరణతో ఉద్యోగం సంపాదిస్తుంది. చివరికి అసలు అమ్మాయికి విషయం తెలిసి వచ్చి బెదిరిస్తుంది. సమాజానికి, అవమానాలకు భయపడి అపరాధ భావంతో నలిగిపోయిన మహిళా మనస్తత్వ కోణాన్ని ఈ కథలో చూడవచ్చు.
ప్రపంచీకరణ ప్రభావంతో అనేక చేతివృత్తులు మరుగున పడిపోయాయి. కుల వృత్తులైన కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మేదర, స్వర్ణకారుల మొదలైనవాళ్ళు గ్రామాల్లో పనులు లేక బతుకు బండిని ఈడ్చడానికి పట్టణాలకు వెళ్ళి వారి వృత్తులు కాకుండా అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్లుగాను, చిన్నచిన్న కర్మాగారాల్లో కార్మికులగానో, సెక్యూరిటీ గార్డులాగానో బతకవలసిన దుస్థితి ఏర్పడింది. ముంపు గ్రామాల రైతులు పల్లెల్లో పనులు లేక పట్టణాల్లో బతకలేక విలవిల్లాడుతున్న దయనీయ స్థితిని 'రైతులేని కాలం' కథలో చూడవచ్చు.
ఈ సంపుటిలో ఉన్న పదకొండు కథల్లో పది కథలు ప్రత్యేక సంచికల కోసం, పత్రికల కోసం రాసినవే! ఒక్క 'పాము' కథ మాత్రమే ఏ పత్రికలోనూ, సంచికల్లోనూ ప్రచురించబడలేదు. పల్లెల్లో రైతన్నల మానసిక సంఘర్షణ, పాలకవర్గాల వాళ్ళ చేతిలో నలిగిపోతున్న ప్రజానీకం వేదన ఈ కథల్లో ప్రతిబింబించారు. ఈ కథలన్నీ గౌరునాయుడు మాస్టారి జ్ఞాపకాలే. బిగబట్టుకున్న బాధలోంచి పొంగుకొచ్చిన కథలే. తన కళ్ళ ముందే తను నడయాడిన పల్లెలు జలమయంలో కూరుకుపోవడం, తను ఎరిగిన ముఖాలన్నీ వలసబాట పట్టడం, వ్యవసాయం కనుమరుగవ్వడం వంటివి చూసి కుమిలి కుమిలి ఆయన వేదనను దించుకునేందుకు రాసినవే 'మాయ' కథలు. గౌరునాయుడు స్వయంగా రైతుబిడ్డ. ఆయన ఈ నాలుగు దశాబ్దాలుగా రాసిన కథలన్నీ రైతు జీవితాన్ని, రైతు అనుబంధ వృత్తుల జీవితాన్ని ప్రధాన భూమికగా చేసుకొని రాసినవే. ఇప్పటికే 'ఏటిపాట' (2007), 'ఒక రాత్రి రెండు స్వప్నాలు' (2017) కథా సంపుటుల ద్వారా విశేష పాఠకుల ప్రజాదరణ పొందారు. ఈ 'మాయ' కథలు కూడా చదువరులను ఆలోచింపజేస్తాయి. ప్రశ్నింపజేస్తాయి.

- సారిపల్లి నాగరాజు
80083 70326