Oct 25,2023 18:55

ఢిల్లీ: ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (104), స్టీవ్‌ స్మిత్‌ (71), లబుషేన్‌ (62) అర్ధ శతకాలతో అలరించారు. చివర్లో మ్యాక్స్‌వెల్‌ 40 బంతుల్లోనే శతకం (106) పరుగులు చేయడంతో ఆసీస్‌ 399 పరుగులు చేసింది. ప్రపంచకప్‌లో ఇదే వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. నెదర్లాండ్స్‌ బౌలర్లలో వాన్‌ బీక్‌ 4, బాస్‌ డి లీడే 2, ఆర్యన్‌దత్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

వరల్డ్‌కప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ..

ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. కేవలం 40 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఇందులో 9 ఫోర్ల, 8 సిక్సిర్లు ఉన్నాయి. 252.50 స్ట్రైక్‌రేటుతో 101 పరుగులు సాధించి వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా వైస్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.