
- 40బంతుల్లోనే సెంచరీతో రికార్డు
- నెదర్లాండ్స్‌పై 309పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు
న్యూఢిల్లీ: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 27బంతుల్లోనే అర్ధసెంచరీని పూర్తి చేసిన మ్యాక్స్‌వెల్.. ఆ తర్వాత 13బంతుల్లో మరో 50పరుగులు కొట్టి కేవలం 40బంతుల్లోనే సెంచరీని పూర్తిచేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్‌క్రమ్(47బంతుల్లో సెంచరీ) పేరిట ఉన్న రికార్డును తుడిచేశాడు.
ఇక టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు భారీస్కోర్ నమోదు చేసింది. ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచకప్‌లో ఇది రెండో అత్యుత్తమ స్కోర్. డేవిడ్ వార్నర్ (104; 93బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సర్లు) వరుసగా రెండో శతకం బాదాడు. స్టీవ్ స్మిత్ (71; 68బంతుల్లో 9ఫోర్లు, సిక్సర్), మార్నస్ లబూషేన్ (62; 47బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధ శతకాలతో మెరిసారు. చివర్లో మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 44బంతుల్లో 9ఫోర్లు, 8సిక్సర్లతో ఏకంగా 106పరుగులు చేశాడు.
అంతకుముందు ఓపెనర్ మిచెల్ మార్ష్(9)ను వాన్ బీక్ త్వరగా వెనక్కి పంపినా.. మరో ఎండ్‌లో ఉన్న వార్నర్ ఆరంభం నుంచీ నిలకడగా ఆడాడు. ఆర్యన్‌దత్ వేసిన మూడో ఓవర్‌లో డేవిడ్ వార్నర్ వరుసగా నాలుగు ఫోర్లు బాది భారీస్కోర్‌కు పునాది వేశాడు. మార్ష్.. అకెర్మాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్‌కు చేరగా.. తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్.. తొలుత నెమ్మదిగా ఆడినా.. ఆ తర్వాత దూకుడు పెంచాడు. పాల్ వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు రాబట్టిన అతడు.. వాన్ బీక్ వేసిన 10ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. తర్వాత వార్నర్ కూడా దూకుడు పెంచాడు. అకెర్మాన్ బౌలింగ్‌లో సిక్స్ బాదగా.. విక్రమ్‌జిత్ వేసిన 18 ఓవర్‌లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి అర్ధ శతకం (40బంతుల్లో) అందుకున్నాడు. ఆర్యన్‌దత్ వేసిన 24 ఓవర్‌లో స్మిత్.. వాన్ డెర్ మెర్వే చేతికి చిక్కి ఔటయ్యాడు. ఆ తర్వాత లబుషేన్ ఆరంభంలో నెమ్మదిగా ఆడి.. మెర్వే వేసిన 34ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. బాస్ డి లీడే వేసిన తర్వాతి ఓవర్‌లో అర్ధ శతకం అందుకున్నాడు. ఆర్యన్‌దత్ వేసిన 36 ఓవర్‌లో వరుసగా ఓ సిక్స్, ఫోర్ బాది కొద్దిసేపటికే వెనుదిరిగాడు. మరోవైపు.. 60 బంతుల్లో 78 పరుగులు చేసిన వార్నర్.. లబుషేన్ వచ్చిన తర్వాత నెమ్మదిగా ఆడి బాస్ డి లీడే బౌలింగ్‌లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్లో ఇంగ్లిస్(14) సిబ్రాండ్‌కు చేతిలో ఔటయ్యాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్‌కు నాలుగు, డి లీడేకు రెండు, ఆర్యన్‌దత్ ఒక వికెట్ దక్కాయి.

400 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 15 ఓవర్ల లోపే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హెజిల్‌వుడ్ వేసిన రెండో ఓవర్లో మ్యాక్స్ ఓడౌడ్(6) ఓ ఫోర్ కొట్టగా విక్రమ్‌జిత్ సింగ్ కూడా రెండు బౌండరీలు బాదాడు. స్టార్క్ వేసిన 3వ ఓవర్లో విక్రమ్‌జిత్.. మరో రెండు ఫోర్లు కొట్టాడు. కానీ మిచెల్ స్టార్క్ డచ్ జట్టుకు తొలి షాకిచ్చాడు. అతడు వేసిన ఐదో ఓవర్లో ఐదో బంతికి ఓడౌడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరుసటి ఓవర్లో విక్రమ్‌జిత్ సింగ్ (25 బంతుల్లో 25, 6 ఫోర్లు) రనౌట్ అయ్యాడు. మ్యాక్స్‌వెల్ సూపర్ త్రో తో విక్రమ్ ఔటయ్యాడు. 11 బంతుల్లో 10 పరుగులు చేసిన కొలిన్ అకెర్మన్‌ను హెజిల్‌వుడ్ పదో ఓవర్లో రెండో బంతికి ఎల్బీగా ఔట్ చేశాడు. దీంతో నెదర్లాండ్స్ 14 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ ఒక్కరూ క్రీజ్‌లో నిలదొక్కుకొనే అవకాశం ఆసీస్ బౌలర్లు ఇవ్వలేదు. దీంతో నెదర్లాండ్స్ జట్టు 21 ఓవర్లలో 90పరుగులకే కుప్పకూలింది. జంపాకు నాలుగు, మార్ష్‌కు రెండు, స్టార్క్, హేజిల్‌వుడ్, కమిన్స్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాక్స్‌వెల్‌కు దక్కింది.

వన్డేల్లో చెత్త బౌలింగ్ (టాప్-5)...
2/115(10) : బెస్ డి లీడే(నెదర్లాండ్స్).. : ఆస్ట్రేలియాపై(2023)
0/113(10) : మెక్ లూవీస్(ఆస్ట్రేలియా) : దక్షిణాఫ్రికాపై(2006)
0/113(10) : ఆడం జంపా(ఆస్ట్రేలియా) : దక్షిణాఫ్రికాపై(2023)
0/110(10) : వాహబ్ రియాజ్(పాకిస్తాన్) : ఇంగ్లండ్‌పై(2016)
0/110(9) : రషీద్‌ఖాన్(ఆఫ్ఘనిస్తాన్) : ఇంగ్లండ్‌పై(2019)
----------
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అత్యధిక స్కోర్లు..
417/6 : ఆఫ్ఘనిస్తాన్‌పై(పెర్త్-2015)
399/8 : నెదర్లాండ్స్‌పై(ఢిల్లీ-2023)
381/5 : బంగ్లాదేశ్‌పై(నాటింగ్‌హామ్-2019)
377/8 : దక్షిణాఫ్రికాపై(బెస్సెటెర్రీ-2007)
376/9 : శ్రీలంకపై(సిడ్నీ-2015)
వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో గెలుపు..
317 : భారత్ (శ్రీలంకపై, త్రివేండ్రం 2023)
309 : ఆస్ట్రేలియా (నెదర్లాండ్స్‌పై, ఢిల్లీ 2023)
304 : జింబాబ్వే (యుఏఇపై, హరారే 2023)
290 : న్యూజిలాండ్ (ఐర్లాండ్‌పై, అబెర్డీన్ 2008)
275 : ఆస్ట్రేలియా (ఆఫ్ఘనిస్తాన్‌పై, పెర్త్ 2015)
స్కోర్‌బోర్డు..
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : మార్ష్ (సి)అకెర్మన్ (బి)వాన్ బిక్ 9, వార్నర్ (సి)ఆర్కన్ దత్ (బి)బీక్ 104, స్మిత్ (సి)మెర్వ్ (బి)ఆర్యన్ దత్ 71, లబూషేన్ (సి)ఆర్యన్ దత్ (బి)లీడే 62, ఇంగ్లిస్ (సి)సైబ్యాండ్ (బి)లీడే 14, మ్యాక్స్‌వెల్ (సి)సైబ్రాండ్ (బి)బీక్ 106, గ్రీన్ (రనౌట్) సైబ్రాండ్ 8, కమిన్స్ (నాటౌట్) 12, స్టార్క్ (సి)అకెర్మన్ (బి)బీక్ 0, జంపా (నాటౌట్) 1, అదనం 12. (50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 399పరుగులు.
వికెట్ల పతనం: 1/28, 2/160, 3/244, 4/266, 5/267, 6/290, 7/393, 8/393
బౌలింగ్: ఆర్యన్ దత్ 7-0-59-1, అకెర్మన్ 4-0-14-0, బీక్ 10-0-74-4, మీకెరన్ 10-0-64-0, విక్రమ్‌జీత్ సింగ్ 4-0-27-0, మెర్వ్ 5-0-41-0, బీక్ 10-0-115-2.
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జిత్ సింగ్ (రనౌట్) మ్యాక్స్‌వెల్ 25, మ్యాక్స్‌ఒవాడ్ (బి)స్టార్క్ 6, అకెర్మన్ (ఎల్‌బి)హేజిల్‌వుడ్ 10, సైబ్రాండ్ (సి)వార్నర్ (బి)మార్ష్ 11, లీడే (ఎల్‌బి)కమిన్స్ 4, ఎడ్వర్డ్స్ (నాటౌట్) 12, తేజ నిడమానూరు (సి)ఇంగ్లిస్ (బి)మార్ష్ 14, వాన్ బీక్ (సి)ఇంగ్లిస్ (బి)జంపా 0, మెర్వ్ (ఎల్‌బి)జంపా 0, ఆర్యన్ దత్ (ఎల్‌బి)జంపా 1, మీకెర్మన్ (స్టంప్)ఇంగ్లిస్ (బి)జంపా 0, అదనం 7. (21 ఓవర్లలో) 90పరుగులకు ఆలౌట్.
వికెట్ల పతనం: 1/28, 2/37, 3/47, 4/53, 5/42, 6/84, 7/86, 8/86, 9/90, 10/90
బౌలింగ్: స్టార్క్ 4-0-22-1, హేజిల్‌వుడ్ 6-0-27-1, కమిన్స్ 4-0-14-1, మార్ష్ 4-0-19-2, జంపా 2-0-8-4.
వన్డే ప్రపంచకప్‌లో నేడు..
ఇంగ్లండ్ × శ్రీలంక
(వేదిక: బెంగళూరు; మ.2.00గం||లకు)