ప్రతి ఉదయాన్నీ తట్టి నిద్రలేపి
విత్తన భాషను వింటూ
పైరు కలల్ని కంటూ
నేలకు నాగలై తను పంటలా మారి
శ్రమగీతం ఆలపిస్తూ ఉంటాడు
రైతు ఉన్న ఊరు, దేశం
ద్విగుణీకృత దీపంలా వెలుగుతూనే ఉంటుంది
అప్పుల ద్ణుఖం, చీకటి కోణాలు ఎన్నున్నా
వెన్నుపై ప్రపంచ పటాన్ని మోస్తూ
ఒక ధీరుడిలా కనిపిస్తూ
శ్రమైక్య చతురతను మేల్కొలుపుతూనే ఉంటాడు
రైతు సేవలు అజరామరం
శ్రమ స్వేదం అభాసుపాలు
గిట్టుబాటు అశనిపాతం
అయినా అవనిపైనే అతని వ్యవసాయ మమకారం
ప్రతి గింజా రైతు బిక్షే
ఆక్షేపణలు అడ్డుగోడలై నిలిచినా
కారు, కారుకు కొత్త గింజై మొలకెత్తాల్సిందే
దేశ ఆకలి దిగుల్ని తీర్చాల్సిందే!
మబ్బు మురిపిస్తుంది
వాన ఉరికెత్తిస్తుంది
కలలన్నీ ఒక్కోసారి తడిసి
మొలకలై కన్నీరు కారుస్తాయి
అప్పులన్నీ ఉరితాళ్ళై వెక్కిరిస్తాయి
నమ్ముకొన్న నేల మాత్రం
రైతు నుదుటిన సింధూరంలా
విజయ తిలకమై నవ్వుతూ కనిపిస్తుంది
- మహబూబ్ బాషా చిల్లెం
95020 00415










