
శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెల మాథ్యూస్ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా 'టైమ్డ్ ఔట్' అయిన బ్యాటర్‌గా నిష్క్రమించాడు. ఐసిసి నిబంధనల ప్రకారం ఒక బ్యాటర్ ఔటై.. మరో బ్యాటర్ బ్యాటింగ్‌కు సిద్ధం కావడం రెండు నిమిషాల్లో జరిగిపోవాలి. కానీ మాధ్యూస్ ఆ నిబంధనను పాటించకపోవడంతో పెవీలియన్‌కు చేరాల్సి వచ్చింది. తొలుత సమరవిక్రమ(41) ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన మాధ్యూస్.. హెల్మెట్ బెల్ట్ తెగిపోవడంతో మరో హెల్మెట్ తెమ్మని మైదానం బయట ఉన్న ఆటగాడికి చెప్పాడు. అతడు మరో హెల్మెట్ తెచ్చి మాధ్యూస్ బ్యాటింగ్‌కు ఉపక్రమించే సమయానికి ఐసిసి నిబంధనల ప్రకారం మూడు నిమిషాల సమయం పూర్తయిపోయింది. ఈ విషయాన్ని బంగ్లా కెప్టెన్ అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో మాధ్యూస్ కూడా బంగ్లా కెప్టెన్‌కు ఈ విషయం చెప్పినా షకీబ్ ఒప్పకోలేదు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో టైమ్ ఔట్ అయిన తొలి బ్యాటర్‌గా మాధ్యూస్ నిలిచాడు. ఈ విషయమై మాజీ క్రికెటర్లు కొంతమంది.. షకీబ్ క్రీడాస్ఫూర్తితో వ్యవహరిస్తే మంచిదని పేర్కొనగా.. నిబంధనల ప్రకారమే వ్యవహరించాడని మరికొంతమంది వెనకేసుకొస్తున్నారు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో..
అంతర్జాతీయ క్రికెట్‌లో మాథ్యూస్ తొలిసారి టైమ్డ్ ఔట్ కాగా.. అతని కంటే ముందు క్రికెట్‌లో ఈ రకంగా ఔట్ అయినవారంతా ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లోనే. ఇలా ఔటైన వారు ఆరుగురు క్రికెటర్లు ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి ఓ క్రికెటర్ ఉన్నాడు. దేశవాళీలో త్రిపుర తరఫున ఆడిన హేములాల్ యాదవ్.. 1997 రంజీ సీజన్‌లో ఒడిషా-త్రిపుర మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసేందుకు తన వంతు వచ్చినా క్రీజులోకి వెళ్లకుండా బౌండరీ లైన్ వద్ద కోచ్‌తో ముచ్చట్లు పెట్టుకుంటూ గడిపాడు. దీంతో అంపైర్లు రెండు నిమిషాల తర్వాత అతడిని ఔట్‌గా ప్రకటించారు.