Nov 04,2023 21:05

ఒక్క పౌండ్‌ వేతనం పెంపునపై ఆందోళన
లండన్‌ : దిగ్గజ రిటైల్‌ కంపెనీ అమెజాన్‌కు ఉద్యోగ, కార్మికులు సెగ చూపిస్తున్నారు. బ్లాక్‌ ఫ్రైడే పేరుతో సమ్మె చేపడుతున్నట్లు హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన కంపెనీ తమ ఉద్యోగులకు కేవలం ఒక్క పౌండ్‌ మాత్రమే వేతనం పెంచడంతో యాజమాన్యంపై ఆ వర్గాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌లో వచ్చే మంగళవారం నుంచి శుక్రవారం వరకు సమ్మె చేయనున్నట్లు అమెజాన్‌ ఉద్యోగులు తెలిపారు. నవంబర్‌ 24న బ్లాక్‌ ఫ్రైడే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగు రోజుల పాటు వాక్‌ అవుట్‌ నిరసన చేపట్టారు. ఒక్క పౌండ్‌ వేతనం పెంపును నిరసిస్తూ కొవెర్టి వేర్‌హౌజ్‌ వద్ద 1000 మంది పైగా కార్మికులు ఆందోళన చేయడానికి సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం పది గంటల పని విధానంతో గంటకు 11.80 పౌండ్లు మాత్రమే చెల్లిస్తుందని.. ఇది తమ జీవన వ్యయాలకు సరిపోవడం లేదని జిఎంబి ఆర్గనైజర్‌ రాచెల్‌ ఫాగన్‌ పేర్కొన్నారు. ఒక్క పెద్ద కార్పొరేషన్‌లో కార్మికులకు అతి తక్కువ చెల్లింపులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొవెంట్రిలోని తమ సమ్మె బ్రిటన్‌లోని మొత్తం లాజిస్టిక్‌ను ప్రభావితం చేయనుందని ఆమె తెలిపారు. అమెజాన్‌ తన వేతన పెంపు ప్రాధాన్యతల్లో మార్పులు చేయాలని రాచెల్‌ డిమాండ్‌ చేశారు.