- మరో 20 మంది పరిస్థితి విషమం
మొగదిషు : సెంట్రల్ సోమాలియా నగరమైన బెలెద్వెనెలో సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద పేలుడు పదార్దాలతో నిండిన వాహనాన్ని శనివారం పేల్చివేయడంతో 15మంది మరణించగా, మరో 40మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. వారిలో 20మంది పరిస్థితి విషమంగా వుందని, వారిని అధునాతన వైద్య చికిత్సల కోసం మొగదిషుకు విమానంలో పంపాలని భావిస్తున్నట్లు హిర్షాబెల్లె మానవతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మహ్మద్ యూసుఫ్ తెలిపారు. హిరాన్ ప్రాంత రాజధాని అయిన బెలెద్వెనె నగరం ఇటీవల అల్‌ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్ షాబాబ్ తీవ్రవాదులపై సోమాలియా ప్రభుత్వ తాజా మిలటరీ దాడులకు కేంద్రంగా మారింది. దాడి జరిగిన ప్రాంతం నుండి దట్టంగా నల్ల పొగ కమ్మడం, పక్కనే మంటల్లో ధ్వంసమవుతున్న ట్రక్కు కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడికి కారకులెవరనేది ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సాధారణంగా అల్ షాబాబ్ ఇటువంటి దాడులకు తెగబడుతూ వుంటుంది.