- కాల్పులు, పేలుళ్లలో నలుగురు మృతి, పలువురికి గాయాలు
మొగదిషు : సోమాలియా రాజధాని మొగదిషులో పేరును ఒక హోటల్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని అల్-షాబాబ్ తీవ్రవాదులు రాత్రంతా జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారని, చాలామంది గాయపడ్డారని భద్రతా సంస్థ అధికారులు సోమవారం తెలిపారు. తెల్లవారిన తర్వాత కూడా అప్పుడప్పుడూ కాల్పులు, పేలుళ్లు శబ్దాలు వినిపిస్తున్నాయని భద్రతా అధికారి మహ్మద్ దహీర్ తెలిపారు. వీరిలో ప్రభుత్వ అధికారులు కూడా వున్నారని చెప్పారు. రాజధానిలో అత్యంత భద్రతా ఏర్పాట్లు వుండే ప్రాంతంలో సోమాలియా అధ్యక్ష భవనానికి కొన్ని గజాల దూరంలో ఉండే 'విల్లా రోజ్' హోటల్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. తీవ్రవాదులను ఒక గదిలో బంధించగలిగామని ఆయన తెలిపారు. పెద్ద ఎత్తున రెండుసార్లు పేలుళ్లు చోటు చేసుకున్నాయని, ఆ తర్వాత కాల్పులు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తర్వాత ప్రజలు అక్కడ నుండి చెల్లాచెదురుగా పారిపోవడం కనిపించిందన్నారు. సోమాలియా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి అల్‌ఖైదా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అల్‌ఖైదా అనుబంధ సంస్థ అల్ షాబాబా ఈ దాడికి కారణమని భావిస్తున్నారు.