Oct 18,2023 09:49
  • మరో ప్రమాదంలో ఒకరి మృతి
  • తమిళనాడులో విషాదం

చెన్నై : బాణాసంచా గోదాంలో జరిగిన భారీ ప్రమాదంలో పది మంది సజీవ దహనమయ్యారు. ఇదే తరహా మరో ప్రమాదంలో మరొకరు మరణించారు. తమిళనాడులోని విరుధునగర్‌ జిల్లాలో మంగళవారం ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెంగపాలయం వద్ద ప్రైవేటు బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఘటనలో ఎనిమిదిమంది మహిళలతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కిచనయకంపట్టి వద్ద మరో ప్రైవేట్‌ బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 35 ఏళ్ల వ్యక్తి మరణించారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక, రెస్క్వూ సర్వీస్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమిక విచారణ ప్రకారం రెంగపాలయం యూనిట్‌లో కొత్తగా తయారు చేసిన బాణాసంచాను పరీక్షిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 80 మంది వరకూ కార్మికులు ఉన్నారు. గాయపడిన వారిని శ్రీవిల్లిపుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కిచనయకంపట్టి వద్ద ఫ్యాక్టరీలోనూ బాణాసంచా పేల్చుతున్న సమయంలోనే ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. రెండు బాణాసంచా గోదాముల యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదాలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున, గాయపడిన వారికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. తమిళనాడులో వివిధ బాణాసంచా ఫ్యాక్టరీల వద్ద ఈ నెలలో జరిగిన ప్రమాదాల్లోనే ఇప్పటి వరకూ 37 మంది మరణించారు.