ప్రజాశక్తి - భీమవరం, భీమవరం రూరల్ :పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. ఏడు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెంటేవారితోటలో ఎనిమిది గదులతో నిర్మించుకున్న రెండు తాటాకు ఇళ్లలో కంచర్ల భవాని, డి.దుర్గారావు, బూడిద ఆదిలక్ష్మి, మోటుపల్లి బేబీ సరోజినీ, డి.మణి, బోయినపల్లి రమణయ్య, గుండెపల్లి చంద్రకు చెందిన ఏడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరంతా చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తాటాకు ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో అందులో నివసిస్తున్న వారంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని సామానులు అగ్నికి ఆహుతి కావడంతో వారంతా కట్టుబట్టలతో మిగిలారు. భీమవరం, ఆకివీడుకు చెందిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇళ్లన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.తొమ్మిది లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు.
- కాలి బూడిదైన రూ.3.20 లక్షల నగదు
అగ్ని ప్రమాదంలో రూ.3.20 లక్షల నగదు దగ్ధమైందని డ్వాక్రా మహిళలు బూడిగ ఆదిలక్ష్మి, గుండెపల్లి చంద్ర కన్నీరుమున్నీరయ్యారు. బ్యాంకులో చెరో రూ.లక్షా 60 వేలు చొప్పున రుణం తీసుకున్నామని, ఆ సొమ్మును ఇంట్లో బీరువాలో భద్రపరిచామని తెలిపారు. అగ్నిప్రమాదంలో ఆ సొమ్మంతా కాలిబూడిదైందని ఆవేదన వ్యక్తం చేశారు.