హైదరాబాద్ బజార్‌ఘాట్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదం దిగ్భ్రాంతికరం. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 21 మందిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, డిఆర్‌ఎఫ్ బృందాలు అతి కష్టంమీద కాపాడగలిగాయి. సకాలంలో స్పందించారు కాబట్టి వారి ప్రాణాలైనా దక్కాయి. ఒక వ్యాపారవేత్తకు చెందిన నాలుగు అంతస్తుల ఈ భవనంలో సెల్లార్‌లో ప్రారంభమైన మంటలు నిమిషాల వ్యవధిలోనే నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు ఈ స్థాయిలో చెలరేగడానికి, సెల్లార్లో అక్రమంగా రసాయనాలు నిలువచేయడమే కారణమని చెబుతున్నారు. ఈ అక్రమ నిలువల గురించి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు చెబుతుండటం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. ప్రమాదం అనంతరం నిర్వహించిన దర్యాప్తులో రసాయనాలను నిలువ ఉంచడానికి ఒక చోట లైసెన్స్ పొంది వేరువేరు చోట్ల నిలువ ఉంచినట్లు తేలిందని సమాచారం. ప్రమాదకరమైన రసాయనాలను జనావాస ప్రాంతాల్లో నిలువ చేయడం చట్ట ప్రకారం నిషేధం. అయితే, ఆ చట్టాన్ని అమలు చేయడంలో అధికార యంత్రాంగపు చిత్తశుద్ధే ప్రశ్నార్ధకం. ఆ పరిశ్రమ నిర్వాహకులతోనో, వ్యాపారవేత్తలతోనో ఉన్న సంబంధాలో, రాజకీయ నాయకుల నుండి వచ్చే ఒత్తిళ్లో కారణమేదైనా చూసీచూడనట్లు వ్యవహరించడానికి అధికారులు అలవాటుపడ్డారు. హైదరాబాద్ అవుటర్ రింగ్‌రోడ్డు లోపల రెడ్, ఆరెంజ్ విభాగంలో సుమారు 1350 ప్రమాదకరమైన పరిశ్రమలు ఉన్నట్లు అంచనా. వీటిని నగర శివార్లకు తరలించాలన్న ప్రతిపాదన ఏళ్ల తరబడి ఉంది. అయినా, ఆచరణలోకి రాకపోవడానికి కారణమేమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే భాగ్యనగరంలో ఏడాదికేడాదికి ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి. 2021లో 139, 2022లో 236 అగ్నిప్రమాదాలు జరగ్గా ఈ ఏడాది ఆగస్టు నాటికే 132 ప్రమాదాలు నమోదయ్యాయి. గత ఏడాదన్నర కాలంలో ఒక్క హైదరాబాద్ ప్రాంతంలోనే ఐదు ఘోర ప్రమాదాలు జరగ్గా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. సికింద్రాబాద్‌లోని ఒక గోడౌన్‌లో గత ఏడాది జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది బీహార్ వలస కూలీలు బుగ్గి అయ్యారు. సికింద్రాబాద్ రూబీ హోటల్ సెల్లార్లో గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు. సికింద్రాబాద్‌లోనే ఒక స్పోర్ట్స్ షాపులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు బీహారీయులు మరణించారు. ఈ ప్రమాదాన్ని నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది పది గంటలపైగా శ్రమించాల్సి వచ్చింది. ఆరుగురిని బలిగొన్న స్వప్నలోక్ దుర్ఘటన మరొకటి. ఇలా చెప్పుకుంటే పోతే ఈ జాబితాకు అంతు ఉండదు.
ఈ దుస్థితి ఒక్క హైదరాబాద్ నగరానికే పరిమితం కాదు. కరోనా సమయంలో విజయవాడలోని ఒక హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదం గుర్తుండే ఉంటుంది. బెంగళూరు నగరంలో ఈ ఏడాది అక్టోబర్ 19వ తేది వరకు 2,289 అగ్ని ప్రమాదాలు జరిగాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రమాదాల సంఖ్య 12 శాతం ఎక్కువ. దేశ రాజధాని నగరం ఢిల్లీలో గత ఏడాది 16,500 అగ్ని ప్రమాదాలు జరగగా 82 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబాయి, చెన్నై నగరాల్లో కూడా గత ఏడాదితో పోలిస్తే అత్యధిక ప్రమాదాలే చోటుచేసుకున్నాయి. వీటిలో అత్యధిక భాగం అపార్ట్‌మెంట్లు, రెస్టారెంట్లు, అనుమతి లేకుండా జనావాస ప్రాంతాల్లో నడుస్తున్న పారిశ్రామిక యూనిట్లే కారణమని ఈ అన్ని నగరాల్లో అగ్నిమాపకశాఖ అధికారులు ఈ ఏడాది విడుదల చేసిన నివేదికల్లో పేర్కొన్నారు. చెన్నై నగరంలో సెప్టెంబర్‌లో విడుదల చేసిన నివేదికలో వందలాది అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లో నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్‌బిసి) ప్రకారం అగ్ని ప్రమాదాలు ఎదుర్కోవడానికి అవసరమైన ఏర్పాట్లు లేవని పేర్కొన్నారు.
నగరీకరణ పెరుగుతున్న కొద్దీ ఇటువంటి ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలి. నగరపాలక సంస్థ, అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి. ఒకటి, రెండు రోజుల హడావిడి కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు ప్రారంభించాలి. ఆ మేరకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించాలి. అప్పుడే భద్రమైన నగర జీవనం సాధ్యమవుతుంది.