ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్ కోనసీమ) : ప్రసిద్ధిగాంచిన ద్రాక్షారామం పుణ్యక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన సామూహిక వరలక్ష్మీవ్రతాలు పలు విమర్శలకు తావిచ్చాయి. 5000 మంది మహిళలను వరలక్ష్మీ వ్రతాలకు పిలిచారు. అందరికీ టెంట్లు వేయడంలో దేవస్థానం సిబ్బంది విఫలం కాగా భక్తులంతా ఉదయం నుండి 11 గంటల వరకు మండుటెండలో పూజలు చేశారు. పలువురు భక్తులు ఎండకు తట్టుకోలేక గొడుగులు తెచ్చుకోగా, కొందరు ఎండకు తట్టుకోలేక సొమ్మసిల్లిపడిపోయారు. మహిళలకు అందజేస్తామన్న చీర రవిక రూపు అందరికీ అందించకపోవడంతో పలువురు మహిళా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకొర ఏర్పాట్లు చేసి టికెట్ల పంపిణీ నుండి పూజా కార్యక్రమాల వరకు అన్నిట్లోనూ అధికారుల విఫలం కొట్టచ్చినట్లు కనపడిందని మండిపడ్డారు. దేవస్థానం తీరుపై భక్తులు బహిరంగంగా విమర్శించారు. పలువురు చిన్న పిల్లలతో ఎండలో అలమటించిపోయారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ దంపతులు ఈ పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆలయ ఈవో తారకేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గంగవరం ఎస్సై జానీ భాష ద్రాక్షారామ ఎస్‌ఐ వినోద్ లు శాంతిభద్రతలు పర్యవేక్షించారు. మంత్రి పాల్గొన్న కార్యక్రమంలోనే ఏర్పాట్లు ఈ విధంగా ఉండటం పై పలువురు మహిళలు భక్తులు తీవ్రంగా అసహనాన్ని వ్యక్తం చేశారు.