
ఖానంపల్లి అనే గ్రామంలో లక్ష్మీరాజం అనే రైతు ఉన్నాడు. ఆయన భార్య పేరు రాజమణి. వారికి ఇద్దరు ఆడపిల్లలు. ఆ రైతు నేలను నమ్ముకొని, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. కూతుర్లను ఎంతో ప్రేమతో పెంచుతున్నాడు. వ్యవసా యంలో ఎన్ని ఇబ్బందులు గురైనా ఆ కష్టాన్ని వారికి తెలియనిచ్చేవాడు కాదు. తల్లిదండ్రులు తిన్నా, తినకపోయినా పిల్లలకు మాత్రం కడుపునిండా అన్నం పెడుతున్నారు. అడిగింది లేదనకుండా కొనిస్తున్నారు. అయితే, తల్లిదండ్రుల కష్టం తెలియని పిల్లలు సరిగా చదివే వారు కాదు. క్లాసులో ఎప్పుడూ వెనుకబడే ఉండేవారు.
ఒక రోజు లక్ష్మిరాజం ఇంటికి బంధువులు వచ్చారు. 'ఈ ఏడాది చేతికి వచ్చిన పంట, వర్షాలు బాగా పడటంతో కొట్టుకు పోయింద'ని వారితో లక్ష్మి రాజం బాధగా చెప్పాడు. పిల్లల చదువు కోసం, తను, తన భార్య పడుతున్న శ్రమను, కష్టాన్ని కూడా చెప్పాడు.
ఆ మాటలను పిల్లలిద్దరూ చాటుగా విన్నారు. ఇన్ని రోజులు తండ్రి తమ కోసం పడుతున్న బాధలు తెలిసి చాలా బాధపడ్డారు. అప్పటినుంచి స్కూలుకు క్రమం తప్పకుండా వెళ్లటం మొదలు పెట్టారు. బాగా చదువుకున్నారు. వ్యవసాయం, ఇంటి పనుల్లో కూడా అమ్మానాన్నకు సాయం చేయడం ఆరంభించారు. పిల్లల్లో వచ్చిన మార్పుకు లక్ష్మిరాజం దంపతులు ఎంతో సంతోషించారు.
- ఏ. శివాణి, 7వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
నర్సింహుల పల్లి, పెద్దపల్లి జిల్లా.