ముంబై : స్టాక్ మార్కెట్లు మూడోరోజు లాభాలతో నడుస్తున్నాయి. విదేశీ నిధుల ప్రవాహం, ఐటీ కౌంటర్ల కొనుగోళ్ల మధ్య మంగళవారం ట్రేడింగ్ కొనుగోలుదారులకు సానుకూలంగా ఉంది. మంగళవారం ట్రేడింగ్‌లో 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ 187.61 పాయింట్లు పెరిగి 62,151.29 వద్దకు చేరుకుంది. ఇక ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 69.35 పాయింట్లు లాభపడి 18,383.75 వద్దకు చేరుకుంది. ఇక సెన్సెక్స్ కంపెనీల్లో ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఏషియన్ పెయింట్స్, ఐటిసిలు లాభపడ్డాయి. టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ వెనుకబడి ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యోలు గ్రీన్‌లో ట్రేడవుతుండగా, షాంఘై హాంకాంగ్‌లో తక్కువగా ఉన్నాయి.
కాగా, సోమవారం అమెరికా మార్కెట్ ఎక్కువ లాభాలతో ముగిసింది. 'ఆర్థిక సంక్షోభానికి దారితీసే యుఎస్ రుణ పరిమితి పెంపు జూన్ 1వతేదీ వరకే గడువు ఉంది. ఈ రుణ పరిమితి గడువు ప్రభావం కూడా అమెరికా మార్కెట్లపై తక్కువ ప్రభావమే చూపుతున్నట్లు కనిపిస్తోంది' అని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ విపి (రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే అన్నారు. ఇక ఎక్స్‌చేంజ్ డేటా సమాచారం ప్రకారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) 922.89 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.29 శాతం పెరిగి 76.21 డాలర్లకు చేరుకుంది. బిఎస్‌ఇ బెంచ్‌మార్క్ సోమవారం 234 పాయింట్లు లేదా 0.38 శాతం పెరిగి 61,963.68 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 111 పాయింట్లు లేదా 0.61 శాతం పుంజుకుని 18,314.40 వద్ద ముగిసింది.










