- సెన్సెక్స్‌కు 523 పాయింట్ల నష్టం
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో పండుగ సీజన్ కానరావడం లేదు. వరుసగా ఐదో రోజు ఈక్విటీ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. బుధవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 523 పాయింట్లు కోల్పోయి 64,049కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 160 పాయింట్లు తగ్గి 19,122 వద్ద ముగిసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఆందోళనలు ఇన్వెస్టరల్లో విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. మరోవైపు అమెరికాలో బాండ్ల రాబడులు పెరగడం, అధిక చమురు ధరలు, బంగారం కొనుగోళ్లు పుంజుకోవడం కూడా ఈక్విటీ మర్కెట్లపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బిఎస్‌ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.52 శాతం, 0.77 శాతం చొప్పున విలువ కోల్పోయాయి. సిప్లా, అపోలో హాస్పిటల్స్, ఎన్‌టిపిసి, అదాని ఎంటర్‌ప్రైజెస్, ఎస్‌బిఐ లైఫ్ సూచీలు ఒక్క శాతం మేర నష్టపోయాయి.