ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ :మానవ హక్కుల్ని దేవుడు పేరుతో నిర్దాక్షణ్యంగా అణచివేసే మానవ విధ్వంసకర శాస్త్రమే మనుస్మృతి అని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం మనుస్మృతి గ్రంథాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు, రచయిత నల్లి ధర్మారావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకులు సన్నశెట్టి రాజశేఖర్, గరిమెళ్ల అధ్యయన వేదిక అధ్యక్షులు విజికె మూర్తి మాట్లాడుతూ మానవ సంబంధాలను, మానవ జీవితాన్ని విధ్వంసం చేస్తూ దోపిడీ ఆధిపత్య మూకకు తరతరాలుగా అనుకూల విధానాలను మనుస్మృతి చేకూరుస్తోందని విమర్శించారు. అశేష ప్రజానీకానికి వ్యతిరేకతమైన ఆ అధర్మాన్ని తీసివేసే ప్రక్రియలో భాగమే మనుస్మృతులను తగులపెట్టే ప్రక్రియ అని అర్థం చేసుకోవాలన్నారు. 1927 నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక మార్గంలో ఈ ప్రయాణం సాగుతోందని చెప్పారు. ఇటువంటి ప్రజావ్యతిరేక మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించడం ద్వారా నూతన సంస్కృతిని నెలకొల్పగలుగుతామని తెలిపారు. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చాక దేశంలో మతసామరస్యం తీవ్రంగా దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీలపై దాడులు పెరిగాయని, వారు స్వదేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం ఎన్నికల్లో భాగమైపోయిందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లోకి తీసుకుందని, న్యాయ వ్యవస్థ సైతం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిఎస్‌పి జిల్లా అధ్యక్షులు ఎన్ రామప్పడు, ఎస్‌ఎన్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కె రాంగోపాల్, సమత సైనిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రామారావు, అంబేద్కర్ విజ్ఞాన మందిరం కమిటీ ప్రధాన కార్యదర్శి రాయి వేణు, అలిండియా దళిత రైట్స్ ఫోరం జిల్లా కార్యదర్శి కె వేణు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.