సీతాకోకచిలుకలు అందమైన రంగురంగుల రెక్కలున్న కీటకాలు. నిత్యం ఎగురుతూ ఉండే జీవులు, ఒకే చోట నిలకడగా ఎక్కువసేపు ఉండవు. సీతాకోకచిలుకను చూడటం ఒక అందమైన దృశ్యం. సీతాకోకచిలుకలు లెపిడోప్టెరా అనే క్రమానికి చెందినవి. వీటి జీవితంలో చాలా ప్రముఖంగా కనిపించే అంశం - నాలుగు జీవిత దశలు - గ్రుడ్డు దశ, లార్వా లేదా గొంగళి పురుగు దశ, విశ్చేతనంగా ఉండే ప్యూపా దశ, తరువాత మెటామోరోఫసిస్ చెందినందువల్ల వెలువడే రంగు రంగుల రెక్కల దశే 'సీతాకొక చిలుక' దశ. ఎక్కువగా సీతాకోక చిలుకలు పగటిపూట ఎగురుతూ చూసేవారికి కనువిందు చేస్తాయి. ప్రపంచంలో అత్యంత అందమైన సీతాకోకచిలుక న్యూగినియాకు చెందిన గోలియత్ బర్డ్‌వింగ్. ఇటీవలనే వీటిపై పరిశోధనలు జరిగాయి. వాటి వివరాలు తెలుసుకుందాం!
ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి చెందిన నిపుణులు పరిశోధనలు జరిపారు. దీనికి కావాల్సిన సమగ్ర హోస్ట్ అసోసియేషన్ డేటాసెట్‌ను, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ రికార్డ్‌లను సమీకరించి 2,300 జాతుల నుండి 391 జన్యువులను సేకరించారు. వాటిలో 92 శాతం అనుకూల ఫలితాలనిచ్చాయి. ఈ ఆధారాల ద్వారా సీతాకోకచిలుకల వంశవృక్షాన్ని పునర్నిర్మించారు. దీని ద్వారా సీతాకోకచిలుక పరిణామానికి సంబంధించిన దీర్ఘకాలంగా పరిశోధనలో ఉన్న మూడు ప్రశ్నలకు పరిష్కారం దొరికింది.
- సీతాకోకచిలుకలు ఉత్తర (లౌరాసియా), దక్షిణ (గోండ్వానా) అర్ధగోళంలో ఉద్భవించాయా?
- ప్రాచీన సీతాకోక చిలుకలు పరిమిత మొక్కలను తినేవా? అవి ఏమిటి?
- ఇప్పుడున్న సీతాకోకచిలుకల డిఎన్‌ఏ ఆధారంగా పరిణామ క్రమంలో వాటి (ఫైలోజెనీ) స్వరూప స్వభావాలు, చరిత్రలకు పరిష్కారాలు దొరికాయని లెపిడోప్టెరా క్యూరేటర్‌గా ఉన్న ఈ ప్రాజెక్ట్ ప్రధాన రచయిత అకిటో కవహారా పేర్కొన్నారు.
చిమ్మటలు, సీతాకోక చిలుకల శిలాజాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటి పుట్టుక, పరిణామ చరిత్ర, వైవిధ్యతలను నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్ ప్రచురించింది.
పుట్టుక : పరిశోధక బృందం జర్మనీకి చెందిన పురాతన రాతి మీద ఒక మట్టి బిందువు కింద సీతాకోకచిలుక శిలాజ నమూనాలను గుర్తించారు. సీతాకోకచిలుకలు కనీసం 20 కోట్ల సంవత్సరాల క్రితమే భూమిపై ఉద్భవించాయని ఈ నమూనాలు నిరూపిస్తున్నాయి. ఉత్తర, మధ్య అమెరికాల్లో మొట్టమొదటి సీతాకోకచిలుకల మూలాలు లభించినట్లు నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ పత్రిక ప్రచురించింది. అయితే 'ఇది నా చిన్ననాటి కల. చిన్నప్పుడు అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీని సందర్శించాను. అక్కడ తలుపుకు సీతాకోకచిలుక ఫైలోజెని చిత్రం అంటించి ఉంది. అది చూసినప్పటి నుండి ఎలాగైనా దానిపై అధ్యయనం చేయాలనుకున్నాను. ఇప్పుడు ఆ కల నెరవేరింది' అని కవహరా అన్నారు.
- ఏమి తింటాయి..?
గోల్డెన్‌రాడ్, స్నాప్ డ్రాగన్ మొక్కలు తేనెను బాగా ఉత్పత్తి చేస్తాయి. ప్రారంభంలో ఆయా జాతుల మొక్కలపై ఆధారపడేవి. పరిణామ క్రమంలో స్థానికంగా ఉండే ప్రకాశవంతమైన రంగులతో ఉన్న పువ్వుల మకరందాన్ని తీసుకుంటున్నాయి. మకరందాన్ని గుర్తించే గ్రాహకాలు ఉంటాయి. నారింజ, అరటిపండ్లు, బెర్రీ, పైనాపిల్, పుచ్చకాయ, బేరి, రేగు తదితర బాగా పండిన పండ్లను కూడా ఇవి తింటాయి. ప్రోబోస్సిస్ అనబడే నాలుక లాంటి నోటిభాగం సహాయంతో తేనెను గానీ, పండ్ల గుజ్జును గానీ తీసుకోగలుగుతాయి. తేనెకోసం పూలపై వాలినప్పుడు పరాగ సంపర్కానికి తోడ్పడతాయి.
- ఒక్కో జాతి ఒక్కో సమయంలో..
సీతాకోకచిలుకలు ప్రధానంగా పగటిపూటే ఎగురుతాయి. వీటి జాతికే చెందిన చిమ్మటలు సాయంత్రం, రాత్రివేళల్లో ఎగురుతాయి. బక్ చిమ్మట తెల్లవారుజామున, సంధ్యా సమయంలో ఎగురుతాయి. పగటిపూట ఎగరటం అనే ఈ ఒక్క సంఘటనే మొత్తం సీతాకోకచిలుక జాతుల పరిణామానికి దారితీసింది.
- చిమ్మట, సీతాకోకచిలుకకు తేడా..
సీతాకోకచిలుక, చిమట మధ్య వ్యత్యాసం.. సీతాకోకచిలుకలు తమ రెక్కలను వాటి వెనుకభాగంలో నిలువుగా ముడుచుకుంటాయి. చిమ్మటలు పొత్తికడుపును దాచి ఉంచే గుడారాల తరహాలో తమ రెక్కలను పట్టుకుని ఉంటాయి. సీతాకోకచిలుకలు పెద్దవిగా ఉంటాయి. వాటి రెక్కలు అనేక రంగులతో ఉంటాయి. చిమ్మట రెక్కలు మందమైన-రంగుతో చిన్నవిగా ఉంటాయి. సీతాకోక చిలుకల సమూహాన్ని 'కాలిడో స్కోప్' అంటారు.
- వేల మైళ్ల ప్రయాణం..!
సీతాకోకచిలుక గంటకు 12 మైళ్ల వేగంతో ఎగరగలదు. కొన్ని చిమ్మటలు గంటకు 25 మైళ్లు ఎగరగలవు! మోనార్క్ సీతాకోకచిలుకలు గ్రేట్ లేక్స్ నుండి గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకూ సుమారు 2,000 మైళ్ల దూరం వరకూ ప్రయాణించి, వసంతకాలంలో మళ్లీ ఉత్తరం వైపుకు తిరిగి వస్తాయి. శరీర ఉష్ణోగ్రత 86 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే సీతాకోకచిలుకలు ఎగరలేవు.