- కేంద్ర వైఖరికి నిసనగా జెవివి ఆధ్వర్యంలో సైన్స్ వాక్
ప్రజాశక్తి - విజయనగరం టౌన్ : శాస్త్ర సాంకేతికతను, శాస్త్రీయ దృక్పథాన్ని నిలువరించేందుకే కేంద్రం సైన్స్ అవార్డులను రద్దు చేసిందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఎం వి ఎన్ వెంకటరావు, రమణ ప్రభాత్ , సాహితీ సంస్థ కన్వీనర్ చీకటి దివాకర్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సైన్స్ వాక్ జరిగింది. ముందుగా గురజాడ నివాసంలో గురజాడ అప్పారావు విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అక్కడ నుంచి మూడు లాంతర్లు, ఎంజీ రోడ్డు, గంట స్తంభం మీదుగా బాలాజీ జంక్షన్ వరకు వాక్ జరిగింది. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైన్స్ అవార్డులు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యరంగంలోనూ కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయమైన ఆలోచనలు ప్రవేశపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవాళి మనుగడలో విప్లవాత్మకమైన మార్పులను గుర్తించిన డార్విన్ సిద్ధాంతం రద్దుచేయడం సరికాదన్నారు. దీనివల్ల వల్ల సమాజం మరింత వెనుకబాటుకు గురౌతుందన్నారు. డార్విన్ సిద్దాంతంతోపాటు భౌతిక, రసాయన శాస్త్రాలు, గణితం, చరిత్రలోని యునైటెడ్ పాఠ్యాంశాలను రద్దు చేయానికి ప్రభుత్వం వద్ద ఉన్న హేతుబద్ధత ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సైన్స్ అభివృద్ధి చెందితేనే కొత్తకొత్త ఆవిష్కరణలతో దేశాభివృద్ధి సాధ్యమౌతుందన్నారు. ఇటువంటి సైన్స్ ప్రోత్సాహాన్ని తగ్గించేందుకు అవార్డులను కేంద్ర ప్రభుత్వం రద్దుచేస్తున్నట్టు ప్రకటించండం దారుణమన్నారు. ఇప్పటికే పరిశోధనా రంగానికి నిధుల కేటాయింపులు భారీగా తగ్గించిందని వివరించారు. శాస్త్రీయతను నిలువరించి, దాని స్థానంలో ఖర్మ
సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ఇటువంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్నారు.
శాస్త్రీయ ఆలోచన లేకుండా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యావిధానం తీసుకొచ్చిందని, అందులో భాగంగా సమాజాభివృద్ధికి దోహదపడే అనేక పాఠ్యంశాలను రద్దుచేసి, వాటి స్థానంలో ఖర్మకాండ, జ్యోతీశ్యం, వాస్తు వంటి అంశాలను ముందుకు తీసుకొస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహనను పెంచే విజ్ఞాన్ ప్రసార్ను కూడా ఇటీవల నిలుపుదల చేసిందన్నారు. తాజాగా శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు సైన్స్, హెల్త్ రంగాలలో 72 అవార్డులను నిలిపివేయాలని ఇండియన్ తీసుకొందన్నారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.నిరసన కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక నాయకులు వి. రాజగోపాల్, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జె.రమేష్చంద్ర పట్నాయక్, డి.రాము, కె.శ్రీనివాసరావు, రౌతు విజయకుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.రామ్మోహన్, బాలరాజు, క్లాస్ 4 యూనియన్ అధ్యక్షులు గంగా ప్రసాద్, శశిధర్, మేధావులు, విద్యార్దులు, యువకులు పాల్గొన్నారు