ఢిల్లీ : ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో తయారీ రంగం ఎనిమిది కనిష్టానికి పడిపోయింది. గడిచిన నెలలో మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) 55.5కు తగ్గిందని ఎస్‌అండ్‌పి గ్లోబల్ తెలిపింది. ఇంతక్రితం సెప్టెంబర్‌లో ఇది 57.5గా నమోదయ్యింది. ఈ సూచీ 50పైనా ఉంటే వృద్థిగా.. దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. ద్రవ్యోల్బణం కొంత తగ్గినప్పటికీ దీర్ఘకాల దృష్టితో విశ్లేషిస్తే.. గరిష్టంగానే ఉందని ఎస్‌అండ్‌పి పేర్కొంది. ఇది అమ్మకాల అవకాశాలను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. ఈ ఏడాది మార్చి తర్వాత ఇంత తక్కువ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి అని ఎస్‌అండ్‌పి పేర్కొంది. వినియోగదారుల వస్తువుల అమ్మకాల్లో మందగమనం ఉందని తెలిపింది. ఏప్రిల్ నుండి ఉద్యోగాల కల్పన రేటు స్వల్పంగా నెమ్మదించిందని విశ్లేషించింది.