మానప్రాణం వీడిన
మాంసపు ముద్దలవి
కాలుతున్న కొవ్వొత్తుల వెలుగులో
అ(తి)వమానం బూడిదవుతుందా
అవని గోడు ఆకాశానికి వి(క)నిపిస్తుందా?
రాతి వనంలో రగిలిన చిచ్చు
ఏలికల చెవిలో
సుప్రభాత ప్రవచనాలేనా?
నిమ్మకు నీరెత్తినట్లుగా
సముద్రంలోని మత్తునంతా తాగేసి
అవకాశపు దుప్పటి కప్పుకొని పడుకున్నారా?
కలాలూ గళాలూ
ప్రతిఘటిస్తున్నాయి..
అకృత్యపు క్రీడలతో
అరాచకాల దారిలో
అత్యాచారాల వేటలో
హింస వేటుకు
రాలిపడ్డ మాతృత్వాలు
రోదిస్తున్న గర్భశోకాలు
మీ అరాచక పాలనకు పరాకాష్ట!
వజ్రోత్సవాలు జరుపుకున్న
శిఖండిని చూసిన భీష్ముడిలా
మానాల అస్త్రాలపై పడి ఉంది తల్లి భారతి
చచ్చి బతుకుతూ బతికి చస్తూ
నెత్తుటి మడుగులో పడ్డ
శీలాలను హత్తుకొని ..
ఇంకా లెక్క సరిపోలేదేమో
మానాలు ప్రాణాలు ధారపోయండి
అవనినిండా అతివల శవాల పూలు పరచండి
కులాలు మతాల ఏలికలు
పాదస్పర్శతో పావనం చేయండి
భారతావనికి సంపూర్ణ పరాభవం జరుగుతుంది
అప్పుడు అధర్మమే రాజ్యపాలన చేస్తుంది
కాష్టం చేయకండి మన్నైనా కప్పండి
కొన్ని యుగాలకు అమ్మతనపు
చిగురులు పుట్టుకొస్తాయి
ఏ మార్పూ లేనప్పుడు కాస్త మన్నైనా కప్పండి!
- స్వయంప్రభ
88975 52022










