
ఇంఫాల్ : మణిపూర్-మయన్మార్ సరిహద్దులో ఉన్న మోరే పట్టణం వద్ద అధిక సంఖ్యలో మెయితీ పోలీసులను మోహరించడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన మహిళలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మోరేకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చికిమ్ గ్రామం వద్ద మహిళల నిరసనలు కొనసాగుతున్నాయి. కుకీలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో మెయితీ పోలీసులను అధిక సంఖ్యలో మోహరించడంపై ఆందోళనలు వ్యక్తవుతున్నాయి. మరింత సంఖ్యలో ఇక్కడ పోలీసులు మోహరింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది శాంతికి భంగం కలిగిస్తుందని కుకీ ఇన్ఫి-గిరిజన ఐక్యత కమిటీ (సిఒటియు) ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ ఇప్పటికే పారా-మిలటరీ, భారత సైన్యం బఫర్ జోన్లు నిర్వహిస్తూ శాంతిని పరిరక్షిస్తున్నాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వం మెయితీ పోలీసులను అధిక సంఖ్యలో మోహరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని ప్రకటనలో తెలిపింది. ఇంఫాల్-మోరే రహదారి వెంబడి మెయితీలు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను తొలగించాలని సిఒటియు డిమాండ్ చేసింది. డబుల్ ఇంజన్ సర్కార వైఫల్యంతో మెయితీలు, కుకీల మధ్య జరిగిన హింసాకాండలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.