ప్రజాశక్తి-తెనాలి(గుంటూరు) : మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లను అదుపు చేయటంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ సిపిఎం, సిఐటియు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. అన్నాబత్తుని పుర వేదిక నుంచి ప్రారంభమైన ప్రదర్శన గాంధీ చౌక్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కె.బాబు ప్రసాద్ మాట్లాడుతూ.. గత 85 రోజులుగా మణిపూర్లో దమనకాండ కొనసాగుతుందన్నారు. హత్యలు, అత్యాచారాలు, దారుణంగా జరుగుతున్నాయన్నారు. మహిళల మాన, ప్రాణాలను కాపాడలేని మణిపూర్ ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. అక్కడి పరిస్థితిని గమనించి కూడా మౌనంగా ఉన్న ప్రధాని మోడీ గద్దె దిగాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ మణిపూర్లో విఫలమయ్యాయని.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ దుర్మార్గానికి ప్రతీకగా మణిపూర్ ఘటనలు నిలిచాయని అన్నారు. ఇప్పటికైనా శాంతి భద్రతలు నెలకొనేలా ప్రధాని చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ములక శివ సాంబి రెడ్డి, సిఐటియు డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు, ఆర్ వెంకటేశ్వర్లు, గౌరీ, మాధవి, సునీత తదితరులు పాల్గొన్నారు.
కొల్లిపరలో నిరసన ర్యాలీ

కొల్లిపర మండల కేంద్రంలో మణిపూర్లో అల్లర్లకు నిరసనగా ప్రజా సంఘాలు, సిపిఎం, సిఐటియు సంయుక్తంగా నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబి రెడ్డి మాట్లాడుతూ.. మణిపూర్ ముఖ్యమంత్రిని వెంటనే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అయిన వైసిపి, టిడిపి, జనసేన కూడా మణిపూర్ అల్లర్లపై పెదవి విప్పకపోవడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోట చంద్రశేఖర్, ఏఐటీయూసీ నాయకులు బాలస్వామి, రైతు సంఘ నాయకులు ఎం సాంబశివరావు, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు మల్లోల రమేష్, జి.సుందర్రావు తదితరులు పాల్గొన్నారు.










